సూపర్ స్టార్ కృష్ణను చివరిసారి చూసేందుకు అభిమానులు, ప్రముఖులు పద్మాలయ స్టూడియోకు భారీగా తరలివస్తున్నారు. ముఖ్యంగా ఏపీలోని గుంటూరు, చీరాల, మదనపల్లి, చిత్తూరు, ఏలూరు, కైకలూరు, అమలాపురం నుంచి వచ్చిన ఫ్యాన్స్... తమ అభిమాన నటుడి పార్థివ దేహాన్ని చూసేందుకు రాత్రి నుంచి పడిగాపులు గాస్తున్నారు. ఇక ఇంతకు మునుపే కృష్ణ పార్థీవదేహాన్ని నానక్ రామ్ గూడలోని నివాసం నుంచి పద్మాలయ స్టూడియోకి తరలించారు. అభిమానుల సందర్శనార్ధం మధ్యాహ్నం వరకు పద్మాలయ స్టూడియోలో కృష్ణ మృతదేహాన్ని ఉంచనున్నారు. మధ్యాహ్నం పద్మాలయ స్టూడియో నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం మహాప్రస్తానంలో కృష్ణ అంత్యక్రియలను ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించనుంది.
మరోవైపు కృష్ణ మృతికి సంతాపంగా ఇవాళ తెలుగు సినీ ఇండస్ట్రీ బంద్ పాటిస్తోంది. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సంతాపం ప్రకటించింది. పద్మాలయ స్టూడియోకి కృష్ణ అభిమానులు భారీగా తరలివస్తున్నారు. నానక్ రామ్ గూడకు వచ్చే ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం కృష్ణ మృతదేహానికి ఏపీ సీఎం జగన్ నివాళులర్పించనున్నారు.