- ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి సర్కారు రెడీ: భట్టి
- పండుగలా గద్దర్ అవార్డుల కార్యక్రమం జరగాలి
- ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాన్సెప్ట్ అద్భుతం: దగ్గుబాటి సురేశ్బాబు
- రాష్ట్ర సర్కారుకు కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు
- డిప్యూటీ సీఎం అధ్యక్షతన గద్దర్ అవార్డుల కమిటీ తొలి మీటింగ్
హైదరాబాద్, వెలుగు: తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచస్థాయికి ఎదగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఏ సమస్యలున్నా వినేందుకు, పరిష్కరించేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, ఈ విషయాన్ని సినీ ఇండస్ట్రీ ప్రతినిధులకు చెప్పాలని తనకు సీఎం సూచించారని తెలిపారు. తెలంగాణ మొత్తానికి గద్దర్ ప్రతిరూపమని పేర్కొన్నారు. తెలంగాణ ఆట, పాటను ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.
సోమవారం సెక్రటేరియెట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన గద్దర్ అవార్డుల కమిటీ మొదటి సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కు ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, సమాచార కమిషనర్ హనుమంతరావు, కమిటీ సభ్యులు డైరెక్టర్ నర్సింగరావు, తనికెళ్ల భరణి, నిర్మాత సురేశ్బాబు, డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ హరీశ్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ వందేమాతరం శ్రీనివాస్, అల్లాని శ్రీధర్, గద్దర్ కూతురు గుమ్మడి విమల పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డుల కమిటీ విధి విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు.
సినీ అవార్డులను గత సర్కారు పట్టించుకోలే..
ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డుల కార్యక్రమాన్ని ఒక పండుగలా నిర్వహించేవారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత సినీ అవార్డులను ఎందుకో గత బీఆర్ఎస్సర్కారు పట్టించుకోలేదని అన్నారు. “తెలంగాణ అంటేనే సాంస్కృతిక జీవనం. తెలంగాణ అంటేనే ఆట, పాట. ఇక్కడ బాధ వచ్చినా.. సంతోషం వచ్చినా.. పాట ద్వారానే వ్యక్తపరుస్తాం. తెలంగాణ సంస్కృతి చాలా గొప్పది. అందరినీ అక్కున చేర్చుకొని, ప్రేమించే కల్చర్ మన రాష్ట్రంలో ఉంటుంది. అసమానతలు, వైరుధ్యాల నేపథ్యంలో ప్రజలు పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నారు” అని భట్టి పేర్కొన్నారు.
ప్రజా యుద్ధనౌక గద్దర్
“పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా ” అంటూ సమాజాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనకు సమాయత్తం చేసి.. ముందుకు నడిపించిన ప్రజా యుద్ధనౌక గద్దర్ అని భట్టి విక్రమార్క కొనియాడారు. గద్దర్ ఒక లెజెండ్ అని, ఈ శతాబ్ద కాలంలో ఆయన లాంటి వ్యక్తి మళ్లీ పుడతారని తాను అనుకోవడం లేదని అన్నారు. ప్రపంచంలోని అన్ని సమస్యలపై పాటలు పాడి, ప్రజలను కదిలించారని చెప్పారు.
“ తెలంగాణలో ఏ గ్రామంలో చూసిన గద్దర్ లాగే పాడాలని ప్రయత్నిస్తుంటారు, ఆయనను అనుకరిస్తుంటారు. అడవి, సినిమా, మానవులు, రాజ్యాంగం అన్నింట్లో గద్దర్ తనదైన ముద్ర వేశారు” అని పేర్కొన్నారు. అన్ని అంశాలు పరిశీలించే రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పేరిట సినిమా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించిందని కమిటీ సభ్యులకు భట్టి వివరించారు. అన్ని అవార్డుల తరహాలోనే అన్ని రంగాలకు గద్దర్ అవార్డులు ఇచ్చుకోవచ్చని తెలిపారు. గద్దర్ అవార్డుల కార్యక్రమం గొప్ప పండుగలా జరగాలన్నారు. ఏ తేదీన జరపాలనేది కమిటీ నిర్ణయం తీసుకొని, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని భట్టి కోరారు.
స్కిల్ వర్సిటీలో యాక్టింగ్ స్కిల్ కోర్స్ పెట్టాలి: సురేశ్ బాబు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాన్సెప్ట్ అద్భుతంగా ఉన్నదని నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు పేర్కొన్నారు. రాష్ట సర్కారుకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తరఫున అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్కిల్ యూనివర్సిటీలో యాక్టింగ్ స్కిల్స్ నేర్పించేందుకు ప్రత్యేక కోర్స్ ఏర్పాటు చేయాలని భట్టిని కమిటీ సభ్యులు కోరారు. అన్ని అంశాలు పరిశీలించి ఇంటిగ్రేటెడ్ స్కూల్, స్కిల్ యూనివర్సిటీలో యాక్టింగ్, కల్చర్ కు సంబంధించిన అంశాలకు చోటు కల్పించడం పై నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం తెలిపారు.