హైదరాబాద్, వెలుగు: 'కబాలి' సినిమా తెలుగు ప్రొడ్యూసర్ సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి అలియాస్ కేపీ చౌదరి(44) ఆత్మహత్య చేసుకున్నారు. గోవాలో తాను నివాసం ఉంటున్న ఫ్లాట్‌లోనే సోమవారం ఉదయం ఉరేసుకున్నారు. కృష్ణప్రసాద్ గత ఏడు నెలలుగా సియోలిమ్‌లోని ఓ ఫ్లాట్‌లో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. సోమవారం ఆయనకు ఫ్రెండ్స్ కాల్ చేశారు.లిఫ్ట్ చేయకపోవడంతో వారు కేపీ చౌదరి ఉండే ఫ్లాట్‌కు వెళ్లారు. అక్కడ ఆయన ఉరివేసుకుని ఉండడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..కేపీ చౌదరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫ్లాట్‌లో క్లూస్ సేకరించారు. ఫ్రెండ్స్, ఫ్లాట్ ఓనర్ స్టేట్‌మెంట్స్ రికార్డ్ చేశారు. హైదరాబాద్‌లోని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక మరేదైనా కారణం ఉందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
డ్రగ్స్ దందాతో అరెస్ట్
కేపీ చౌదరి బీటెక్ పూర్తి చేశారు. సినిమా ఫీల్డ్‌పై ఉన్న ఇంట్రెస్ట్‌తో 2016లో హైదరాబాద్ వచ్చారు. ‘కబాలి’ సినిమా తెలుగు వర్షన్‌కు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సర్ధార్ గబ్బర్ సింగ్, తమిళ చిత్రం కనిటన్’ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. నష్టాలు రావడంతో గోవాకు మఖాం మార్చారు. అక్కడ పబ్ ప్రారంభించి..సినీ ఇండస్ట్రీ సహా హైదరాబాద్‌లోని రెగ్యులర్ కస్టమర్లకు డ్రగ్స్ సప్లయ్ చేశారు. అనుమతులు లేకపోవడంతో పబ్‌ను గోవా అధికారులు కూల్చివేశారు.
దాంతో 2023 ఏప్రిల్‌లో రాజేంద్రనగర్ కిస్మత్‌పురకు మఖాం మార్చారు. అదే ఏడాది మార్చిలో రాయదుర్గం పోలీసులు ఐదుగురు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. ఆ కేసు దర్యాప్తులో కేపీ చౌదరి డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. జూన్ 14న కేపీ చౌదరిని అరెస్ట్ చేశారు.