దేశానికి ఆడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆ అవకాశం అందరకీ దక్కదు. ఎంతో ప్రతిభ దాగుండాలి. అందునా వేల మందితో పోటీపడుతూ తన ప్రత్యేకత ఏంటో నిరూపించుకోవాలి. ఇంతటి పోటీ ప్రపంచంలో ఆ కలగనడమే ఓ గొప్ప. అలాంటిది నిత్యం వ్యవసాయ పొలాల్లో తలమునకలై ఉండే ఓ వ్యవసాయ కూలీ బిడ్డ.. దేశానికి ఆడే అవకాశాన్ని దక్కించుకుంది. ఆమె ఎవరో కాదు.. మన పొరుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అనంతరపురంకు చెందిన అనూష బారెడ్డి.
నార్పల మండలం బండ్లపల్లికి చెందిన బి.లక్ష్మీదేవి, మల్లిరెడ్డిల కూతురే.. అనూష. వీరి కుటుంబం వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. పొలం పనులకు వెళ్లకపోతే పూట గడవని పరిస్థితి. అనూష సైతం కొన్ని సందర్భాల్లో కుటుంబానికి ఆర్థికంగా సహాయపడటం కోసం వ్యవసాయ కూలీగా పనులకు వెళ్ళేది. ఆ కష్టమే తనను జాతీయ జట్టు వరకు నడిపించింది.
అనూష బారెడ్డి.. భారత మహిళా జట్టుకు ఎంపికైంది. ఈ నెల 9 నుంచి 22 వరకు బంగ్లాదేశ్‌తో జరిగే టోర్నీలో టీమిండియా తరఫున ఆమె ప్రాతినిథ్యం వహించనుంది. ఎడమ చేతి స్పిన్నర్, బ్యాటర్ అయిన అనూష ఇటీవల హాంకాంగ్‌లో జరిగిన ఆసియా కప్‌లో మంచి ప్రదర్శన కనపరించింది. ఈ క్రమంలోనే ఆమెకు జట్టులో చోటు కల్పించారు.
బంగ్లా పర్యటనలో భారత మహిళల జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. జూలై 9, 11, 13 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు, జూలై16, 19, 22 తేదీలలో వన్డేలు జరుగనున్నాయి.
భారత మహిళల వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మందాన, జెమీమా రోడ్రిగ్స్, దేవిక వైద్య, ప్రియా పునియా, దీప్తిశర్మ, షఫాలీ వర్మ, అమన్‌జోత్ కౌర్, హర్లీన్ డియోల్, పూజా వస్త్రాకర్, యస్తిక భాటియా, ఉమా చెట్రి, మేఘన సింగ్, అంజలి శర్వాణి, మోనిక పటేల్, రాశి కనోజియా, స్నేహ రాణా, అనూష బారెడ్డి.
భారత మహిళల టీ20 జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మందాన, జెమీమా రోడ్రిగ్స్, దేవిక వైద్య, సబ్బినేని మేఘన, దీప్తిశర్మ, షఫాలీ వర్మ, యస్తిక భాటియా, హర్లీన్ డియోల్, దేవిక వైద్య, ఉమా చెట్రి, అమన్‌జోత్ కౌర్, అంజలి శర్వాణి, పూజ, మేఘన సింగ్, మోనిక పటేల్, రాశి కనోజియా, మిన్ను మణి, అనూష బారెడ్డి.