![తెలుగు ఇండియన్ ఐడల్ విజేత వాగ్దేవి](https://static.v6velugu.com/uploads/2022/06/telugu-indian-idol-winner-vagdevi_pEGazZ5Lyi.jpg)
సంగీత సమరం ముగిసింది. ఆహాలో ప్రసారమైన మొదటి తెలుగు ఇండియన్ ఐడల్ ఎవరవుతారన్న ప్రశ్నకు సమాధానం దొరికింది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీ అందుకొన్న వాగ్దేవి.. మొట్ట మొదటి తెలుగు ఇండియన్ ఐడల్గా చరిత్ర సృష్టించింది. 15 వారాల సుదీర్ఘ సంగీత ప్రయాణం తర్వాత నిర్వహించిన ఫినాలేలో అందరినీ వెనక్కి నెట్టి తొలిస్థానం సంపాదించుకుంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు, రానా దగ్గుబాటి, సాయి పల్లవి ముఖ్య అతిధులుగా విచ్చేసిన గ్రాండ్ ఫినాలే కన్నుల పండుగగా ముగిసింది.
తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ వాగ్దేవికి ట్రోఫీ, రూ.10 లక్షల బహుమానంతో పాటు గీతా ఆర్ట్స్ తదుపరి సినిమాలో పాట పాడే అవకాశం లభించింది. ఇక మొదటి రన్నరప్ శ్రీనివాస్ కు రూ. 3 లక్షలు, రెండో రన్నరప్ వైష్ణవికి రూ. 2 లక్షల బహుమతి గెలుచుకున్నారు. వైష్ణవి పాటకు మంత్రముగ్ధులైన చిరంజీవి తాను నటిస్తున్న గాడ్ ఫాదర్లో పాడే అవకాశం ఇచ్చారు. తొలి తెలుగు సింగింగ్ రియాల్టీ షో ఇండియన్ ఐడల్ను ఆహా ప్రసారం చేసింది. శ్రీరామచంద్ర హోస్ట్ చేసిన ఈ షోను న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన థమన్, నిత్య మీనన్, కార్తీక్ భుజాన వేసుకొని ముందుకు నడిపారు.
ఈ షో విన్నర్ వాగ్దేవి మాట్లాడుతూ, "ఎంతో సంతోషంగా ఉంది. నేను టైటిల్ గెలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఎంతో మంది దిగ్గజాల ముందు నేను పాడాను. ఈరోజు చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడి నుండి ఎన్నో జ్ఞాపకాలతో పాటు సంగీత జ్ఞానాన్ని కూడా తీసుకొని వెళుతున్నాను. అందుకు నేను తెలుగు ఇండియన్ ఐడల్, ఆహా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అని సంతోషం వ్యక్తం చేసింది.
ఆహా సీఈఓ అజిత్ కె ఠాకూర్ మాట్లాడుతూ, "ఆహా ఎప్పుడూ అందరిని అలరించాలని, తెలుగు వారి ప్రతిభను ప్రపంచానికి చూపించాలని అహర్నిశలు శ్రమిస్తోంది. తెలుగు ఇండియన్ ఐడల్ అలా వచ్చిన ఒక అలోచన ఇవాళ ప్రభంజనంలా మారి వాగ్దేవి, వైష్ణవి వంటి యువ గాయనీమణుల సరికొత్త ప్రయాణానికి నాంది పలికింది. ఇన్ని రోజులు మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు, వాగ్దేవి కి అభినందనలు" అని అన్నారు.