తెలుగు కథా కేతనం కేతు విశ్వనాథరెడ్డి

గ్రామీణ జీవనం చిత్రించిన ప్రముఖ తెలుగు కథకులు, కథా విమర్శకులు ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి. ఆయన జప్తు, ఇచ్ఛాగ్ని, విశ్వనాథరెడ్డి కథలు పేర్లతో కథాసంపుటాలు వెలువరించారు. వేళ్లు, బోధి అనే రెండు నవలలు కూడా ఆయన రాశారు. రాయలసీమ ప్రాంత ప్రజల కష్టాలను కడగండ్లను ఆవేదనతో ఆర్తితో, ఆవేశంతో కథలుగా మలిచారు. వీరి కథలు యువకుల్ని అమితంగా ఆకర్షించాయి. అవి ఔత్సాహిక కథకులకు మోడల్స్​గా నిలిచాయి. వీరి ‘కేతు విశ్వనాథరెడ్డి కథలు’ అనే సంపుటికి 1995లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 

విశాలాంద్ర ప్రచురణాలయం వారు ప్రచురించిన కొడవటిగంటి కుటుంబరావు రచనల సంపుటాలకు ఆయన సంపాదకత్వం వహించారు. ఇవి 7 సంపుటాలుగా వెలువడ్డాయి. వీటికి అద్భుతమైన పీఠికల్ని రాశారు. వీరి కథలు వివిధ భాషల్లోకి అనువాదమయ్యాయి. ఈ కథల్లో ప్రధానంగా కరువు, మానవ సంబంధాలు కనిపిస్తాయి. రాయలసీమ కష్టాల్ని బాధ్యతగా నమోదు చేసిన అభ్యుదయ కథా రచయిత ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి. 

కడప జిల్లాలో జన్మించి..

1939లో కడప జిల్లా రంగశాయిపురంలో జన్మించిన ఆయన.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​అభ్యుదయ రచయితల సంఘానికి అధ్యక్షులుగా, ప్రస్తుతం అధ్యక్షవర్గ సభ్యులుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్​ సార్వత్రిక విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో  ఆచార్యులుగా పనిచేశారు. వీరి నాయకత్వంలోనే తెలుగు పాఠ్య పుస్తకాలు ఎంతో ప్రామాణికంగా వెలువడ్డాయి.  వీరు ‘కడప జిల్లా గ్రామ నామాలు’ అనే అంశంపై శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో  పీహెచ్​డీ చేశారు. ఆయన కథలపై కూడా ఎందరో పీహెచ్​డీ చేశారు. 

జర్నలిజంలో..

1962లో ఆంధ్రరత్న, 1993లో ఆంధ్రభూమి ఆదివారం సంపాదకీయం రాశారు. అంబేద్కర్​విశ్వవిద్యాలయం రూపొందించిన ‘సార్వత్రిక’కు సంపాదకత్వం వహించారు. 1992–94 మధ్య మానవి సంపాదకవర్గ సభ్యులు, ఈనాడు జర్నలిజం స్కూలులోనూ పనిచేశారు. ఆంధ్రప్రదేశ్​ ప్రెస్​అకాడమీ సలహా మండలి సభ్యులుగా పనిచేశారు. సామాజిక, రాజకీయ వారపత్రిక ‘ఈ– భూమి’కి సంపాదకులుగా ఉన్నారు. సాహితీ కురువృద్ధుల్లో కేతు మర‌ణం... అభ్యుద‌య సాహిత్యానికి తీర‌నిలోటు.


- డా. రాపోలు సుదర్శన్,
తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం