
- సులభమైన ‘వెన్నెల’ పాఠాలు చెప్పించాలని సీఎం రేవంత్ నిర్ణయం
- వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సెంట్రల్ సిలబస్ తో నడుస్తున్న బడుల్లోనూ నైన్త్, టెన్త్ క్లాసుల్లో తెలుగు సబ్జెక్టును రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. మాతృభాష తెలుగును జిల్లా పరిషత్, సర్కారు, ఎయిడెడ్, ప్రైవేటు బడులతో పాటు సెంట్రల్ సిలబస్ బడుల్లోనూ విధిగా బోధించాలని 2018లో అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కానీ, వివిధ కారణాల వల్ల తెలుగు సబ్జెక్టును కొన్ని బడుల్లో అమలు చేయలేదు.
అయితే, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా బోధించేలా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, ఇతర బోర్డుల పరిధిలోని స్కూళ్ల మేనేజ్మెంట్లతో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు తాజాగా సమావేశం నిర్వహించారు.
ఇప్పటివరకూ సెంట్రల్ సిలబస్ బడుల్లో కేవలం 8వ తరగతి వరకే తెలుగు అమలు చేస్తుండగా, ప్రస్తుతం దాన్ని టెన్త్ వరకూ బోధించాల్సిందేనని విద్యాశాఖ సెక్రటరీ యోగిత రాణా ఆదేశాలు జారీ చేశారు.
వచ్చే విద్యా సంవత్సరం 2025–26లో 9 వ తరగతి, 2026–27లో పదో తరగతిలో విధిగా తెలుగు సబ్జెక్టును పెట్టి, పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. అలాగే తెలుగు సబ్జెక్టును మరింత సరళీకృతం చేసి, వారికి తెలుగుపై ఆసక్తి పెంచేలా విద్యా శాఖ చర్యలు మొదలుపెట్టింది.
దీనికోసం ఇతర రాష్ర్టాలు, ఇతర దేశాల విద్యార్థుల కోసం తెలుగు సబ్జెక్టు సులభతరంగా అర్థమయ్యేలా తయారు చేసిన ‘వెన్నెల’ విధానాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అధికారులకు సూచించారు. దీంతో ఈ విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం 2025–26 నుంచి అమలు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది.