AP News: మళ్లీ తెరపైకి కోడెల ఆత్మహత్య అంశం... అనంతపురం ఎస్పీకి  తెలుగు మహిళ అధికార ప్రతినిధి  ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్​ టీడీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్షలు జరుపుతుందనే వార్తలు వస్తున్నాయి.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్​ మాజీ స్పీకర్​ కోడెల శివప్రసాద్​ ఆత్మహత్య అంశం   తెరపైకి వచ్చింది.  మాజీ స్పీకర్ కోడెలను ఆత్మహత్యకు మాజీ ముఖ్యమంత్రి జగన్​,  గత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి లతో పాటు ఓ ప్రముఖ దిన పత్రిక, టీవీ ఛానల్​ కారణమంటూ.. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళ అధికార ప్రతినిధి తేజశ్విని అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోపే  అసెంబ్లీ మాజీ స్పీకర్​  అని కూడా ఆలోచించకుండా .. 19 తప్పుడు కేసులు బనాయించి..  విచారణ పేరుతో కోడెల శివప్రసాద్​ను  మానసికంగా వేధించి  అప్పట్లో వైసీపీ ప్రభుత్వం క్షోభకు గురిచేసి...  ఆత్మహత్యకు పాల్పడే విధంగా ప్రేరేపించి... వైసీపీ నేతలు   పైశాచిక ఆనందం  పొందారని తేజశ్విని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

అయితే దీనిపై ఇంకా కేసు న‌మోదు కాలేదు. కానీ, తీగ అయితే క‌దిలింది...  త‌ర్వాత ప‌రిణామాలు ఎలా మారుతాయ‌నేది చూడాలి. కానీ, ఇప్పుడు అనూహ్యంగా అస‌లు కోడెల ఎలా ఆత్మహ‌త్య చేసుకున్నారు. దీనికి వైసీపీకి సంబంధం ఏంట‌నేది రాజ‌కీయంగా మ‌రో సారి లోతైన చ‌ర్చసాగుతోంది.  ఈ వ్యవ‌హారం రాజ‌కీయంగా కొన‌సాగుతోంది. ఇంత‌లోనే తెలుగు మ‌హిళ నాయ‌కురాలు ఏకంగా ఎస్పీకి ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిపై ఎస్పీ ఏం చేస్తార‌నేది చూడాలి. స‌ర్కారు కూడా.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంద‌నేది ఆస‌క్తిగా మారింది. ఇప్పటికైతే.. ఈ వివాదం మాత్రం జ‌గ‌న్ చుట్టూ తిరుగుతుండ‌డం గ‌మ‌నార్హం.