- బడుల్లో ఇంగ్లీష్ మీడియం వైపే పేరెంట్స్ మొగ్గు
- ప్రైవేట్ స్కూళ్లలో ఈసారి ఒకటో తరగతిలో 0.33శాతమే తెలుగు మీడియం అడ్మిషన్లు
- సర్కారు బడుల్లోనూ 6.71శాతానికే పరిమితం
- 2008 నుంచే సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం
- 2014 తర్వాత క్రమక్రమంగా ‘తెలుగు’కు దూరం
- ఈసారి గవర్నమెంట్ స్కూళ్లలో 10% లోపే తెలుగు అడ్మిషన్లు
- రెండో తరగతిలో 11%, ఏడో తరగతిలో 14%,
- పదో తరగతిలో 24% శాతమే తెలుగు
హైదరాబాద్, వెలుగు: పదేండ్ల కింది వరకు తెలుగు మీడియం విద్యార్థులతో కళకళలాడిన బడులన్నీ ప్రస్తుతం ఆ మీడియంలో అడ్మిషన్లు లేక వెలవెలబోతున్నాయి. సర్కారు, ప్రైవేటు, ఎయిడెడ్.. ఇట్ల స్కూలు ఏదైనా చదివేది ఇంగ్లీష్ మీడియమే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. తెలుగు మీడియంలో చేరే పిల్లల సంఖ్య వేళ్లపై లెక్కపెట్టాల్సిన దుస్థితి. ఈ ఏడాది ఒకటో తరగతిలో తెలుగు మీడియం అడ్మిషన్లు దారుణంగా పడిపోయాయి. ఒకటో తరగతికి సంబంధించి ప్రైవేటు బడుల్లో జరిగిన మొత్తం అడ్మిషన్లలో 0.33 శాతం మాత్రమే తెలుగు మీడియం కాగా.. సర్కారు బడుల్లోనూ 6.71శాతం మంది మాత్రమే తెలుగు మీడియంలో అడ్మిషన్లు పొందారు.
ఇదీ లెక్క..!
రాష్ట్రంలోని 41,628 పాఠశాలల్లో 59 లక్షలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో సర్కారు బడుల్లో 22.63 లక్షల మంది, ప్రైవేటు బడుల్లో 34.92 లక్షల మంది, ఎయిడెడ్ స్కూళ్లలో 62,738 మంది ఉన్నారు. సర్కారు బడుల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 22, 63,491 మంది విద్యార్థుల్లో 4 లక్షల 08 వేల 662 మంది(18%) మాత్రమే తెలుగు మీడియంలో 16 లక్షల12 వేల 199 (71.23%) మంది ఇంగ్లీష్ మీడియంలో కొనసాగుతున్నారు.
ఇక ప్రైవేటు బడుల్లో చదివే 34 లక్షల 92 వేల 886 మందిలో 20,057 మంది(0.57శాతం) మాత్రమే తెలుగు మీడియం కాగా.. 31 లక్షల 49 వేల 282 మంది (90.16) శాతం ఇంగ్లీష్ మీడియం. ఇక, ఎయిడెడ్ స్కూళ్లలోని 62,738 మంది స్టూడెంట్లలో 8,960 మంది మాత్రమే తెలుగు మీడియం చదువుతుండగా.. మిగిలిన 45,061 మంది ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు.
2008 నుంచే సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం
2008కు ముందు సర్కారు బడులన్నీ తెలుగు మీడియంలో కొనసాగాయి. దీని వల్ల పేద, గ్రామీణ విద్యార్థులు ప్రైవేట్‌స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న స్టూడెంట్లతో పోటీపడలేకపోతున్నారనే విమర్శలు వచ్చాయి. దీంతో ఉమ్మడి ఏపీలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2008లో తొలిసారిగా సక్సెస్ స్కూళ్ల పేరుతో సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు ప్రారంభించారు. కానీ, అప్పట్లో టీచర్లకు సరైన ట్రైనింగ్ లేకపోవడంతో వాటిలో చాలా వరకు మూతపడ్డాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మారిన పరిస్థితుల్లో ఇంగ్లీష్ మీడియం చదువుల వైపు పేరెంట్స్ మొగ్గు చూపారు.
గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంగ్లీష్ మీడియం కోసం పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా సర్కారు బడుల్లో అడ్మిషన్లు పడిపోయి, చాలావరకు మూతపడే స్థితికి వచ్చాయి. ఈ క్రమంలో టీచర్లు, పేరెంట్స్, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తుల మేరకు 2015-–16 విద్యాసంవత్సరం నుంచి వసతులున్న బడుల్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులకు పర్మిషన్ ఇచ్చారు. 2022-–23 విద్యాసంవత్సరం నుంచి పూర్తిగా అన్ని స్కూళ్లలో తెలుగు మీడియంతో సమాంతరంగా ఇంగ్లీష్ మీడియం క్లాసులు ప్రారంభించారు. పిల్లలకు ఇబ్బందులు కావొద్దనే ఉద్దేశంతో బైలింగ్వల్ బుక్స్ ప్రింట్ చేయించారు.
దీని ప్రభావంతో తెలుగు మీడియంలో చేరాలనుకునే విద్యార్థులు కూడా ఇంగ్లీష్ మీడియంలో అడ్మిషన్లు పొందుతున్నారు. దీంతో క్రమంగా తరగతుల వారీగా ఇంగ్లీష్‌మీడియం చదివేవారి సంఖ్య పెరుగుతూ.. తెలుగు మీడియం విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. ప్రస్తుతం సర్కారు బడుల్లో ఒకటో తరగతిలో 1.63 లక్షల మంది చేరితే.. వారిలో కేవలం 10,953 మంది(6.71%) తెలుగు మీడియంలో చేరారు.
ఇంగ్లీష్ మీడియంలో 64,400 (40%) మంది చేరారు. మిగిలిన వారంతా ఇతర మీడియాల్లో చదువుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. తెలుగు మీడియానికి సంబంధించి.. సర్కారు బడుల్లో రెండో తరగతిలో 11 శాతం, మూడో తరగతిలో 21శాతం, నాల్గో తరగతిలో 26 శాతం, ఐదో తరగతిలో 21శాతం మంది చదువుతున్నారు. ఆరో తరగతిలో 16 శాతం, ఏడో తరగతిలో 14 శాతం, 8వ తరగతిలో 14 శాతం, 9వ తరగతిలో 20 శాతం, పదో తరగతిలో 24 శాతం మంది చదువుతున్నారు. తొలిసారిగా పదిశాతానికి లోపే తెలుగు మీడియంలో అడ్మిషన్లు కావడంపై విద్యాశాఖ అధికారులు అయోమయానికి గురవుతున్నారు.
మాతృభాషకు డెంజర్ బెల్స్
విద్యాహక్కు చట్టంతో పాటు నూతన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ) సైతం విద్యలో మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నది. ప్రైమరీ వరకూ మాతృభాషలోనే చదువులు కొనసాగించాలని న్యూ ఎన్ఈపీ సూచించింది. కానీ, ప్రస్తుతం మన రాష్ట్రంలో ఈ పాలసీని అధికారికంగా అమలుచేయడంలేదు. దీంతో మాతృభాష నిబంధనను పక్కనపెట్టారు. మరోపక్క 2010 నాటికే చదువంటే ఇంగ్లీష్‌లో చదవడం, రాయడం, మాట్లాడడం అనే స్థాయికి పరిస్థితులు మారాయి. ఇంగ్లీష్‌లో పట్టు ఉన్న వాళ్లకు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలుపెరగడంతో దిగువ మధ్యతరగతి, పేద తల్లిదండ్రులు కూడా ఇంగ్లీష్ మీడియం వైపు తమ పిల్లలను పంపుతున్నారు.
ఇట్ల అర్బన్ మొదలుకొని రూరల్ వరకు పేరెంట్స్ తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చేర్పిస్తూ ఉండడంతో మాతృభాషలో అడ్మిషన్లు పడిపోతున్నాయి. కాగా, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లపై పేరెంట్స్ మోజు ఆత్మహత్య కంటే తక్కువేమీ కాదని ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ డీపీ సక్లానీ ఇటీవల పేర్కొన్నారు. మాతృభాషలో చదవడం వల్ల సగటు విద్యార్థులు కూడా ఆయా సబ్జెక్టులపై ఎంతోకొంత పట్టుసాధిస్తారని, ఇంగ్లీష్ మీడియం కారణంగా భాష అర్థం కాక, అబో యావరేజ్ స్టూడెంట్లు కూడా బిలో యావరేజ్‌గా మారిపోతున్నారని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ALSO READ : జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి సరికాదు.. విచారణ జరిపి చర్యలు తీసుకుంటం: మంత్రి పొన్నం
ఇలాంటి స్టూడెంట్లకు అటు తెలుగు, ఇటు ఇంగ్లీష్ రాక, సబ్జెక్టులపై పట్టు సాధించలేక ఎందుకూ పనికిరాకుండా పోతున్నారని హెచ్చరిస్తున్నారు. హైస్కూల్ లెవల్లో ఇంగ్లీష్‌మీడియంలో చదవడాన్ని సర్కారు ఆపలేకున్నా రాష్ట్రంలో కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలుచేస్తే కనీసం ప్రాథమిక స్థాయి వరకు అన్ని స్కూళ్లలో విద్యార్థులంతా తప్పనిసరి తెలుగు మీడియంలో చదవాల్సి వస్తుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ప్రైవేటు బడుల్లో తెలుగు లేనట్టే!
సర్కారు బడుల్లో కొద్దొగొప్పో తెలుగు మీడియం పిల్లలుండగా.. ప్రైవేటు బడుల్లో దాదాపు ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నారు. ఈ విద్యాసంవత్సరం ఒకటో తరగతిలో మొత్తం 4.40 లక్షల మంది చేరితే దాంట్లో కేవలం 1,460(0.33%) మంది తెలుగు మీడియంను ఎంచుకున్నారు. ఇంగ్లీష్ మీడియంలో రెండో తరగతిలో 93.19%, మూడో తరగతిలో 93%, నాలుగో తరగతిలో 92.89% , ఐదో తరగతిలో 93.14 శాతం, ఆరులో 93%, ఏడులో 94%, 8వ తరగతిలో 94.05 శాతం, నైన్త్ క్లాసులో 94.71%, టెన్త్ క్లాసులో 95.71 శాతం మంది చదువుతున్నారు. ఎయిడెడ్ స్కూళ్లలోనూ ఇదే పరిస్థితి. అన్ని క్లాసుల్లోనూ 15శాతం వరకూ తెలుగుమీడియంలో చదువుతుం డగా.. ఇంగ్లీష్ మీడియంలో 70 శాతం నుంచి 75 శాతం వరకూ చదువుతున్నారు.
ప్రస్తుతం బడుల్లో మీడియంల వారీగా విద్యార్థుల సంఖ్య
స్కూల్స్ మొత్తం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం
సర్కారు 22,63,491 4,08,662 16,12,199
ఎయిడెడ్ 62,738 89,60 45,061
ప్రైవేటు 34,92,886 20,057 31,49,282
(మిగిలిన విద్యార్థులు హిందీ,ఉర్దూ, ఇతర భాషల్లో చదువుతున్నారు)