
మీమర్స్‌ని ‘ట్రెండ్ సెట్టర్స్’ అని అంటుంటారు. ఎందుకంటే తెరమీద కనిపించకుండా, వినిపించకుండా నాలుగు ఫొటోలకు, రెండు లైన్ల మ్యాటర్ పెట్టి అందరి ముఖాల్లో నవ్వు తెప్పిస్తుంటారు. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇలా ఏ గ్రూపుల్లో చూసినా చాలామంది మీమ్స్ షేర్ చేస్తుంటారు. చిన్నా, పెద్దా అని తేడాలేకుండా మీమ్స్ ఫాలో అవుతున్న ప్రతీ ఒక్కరి స్ట్రెస్ కొంతవరకు తగ్గడానికి కారణం మీమ్స్. అలా ‘బాబూ నువ్వు బీటెక్కా’ అని మీమ్ పేజీ పెట్టి ఆరున్నర లక్షల ఫాలోవర్స్‌తో, తెలుగు మీమర్స్‌లో ఒకడిగా పేరున్న ఆనంద్ గురించి..
మీమ్ పేజీ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది?
‘‘నేను పుట్టింది ప్రకాశం జిల్లా. నాన్న ఆర్మీ ఆఫీసర్ (రిటైర్డ్). దాంతో ట్రాన్స్‌ఫర్‌ల వల్ల దేశం మొత్తం తిరిగాం. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే సెటిల్ అయ్యాం. బీటెక్ కంప్లీట్ చేశా. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న రోజుల్లో ఇంటర్నేషనల్, రీజనల్ మీమ్ పేజీలకు మంచి ఫాలోయింగ్ ఉండేది. వాళ్లు చేసిన మీమ్స్ చూసి ‘నేను కూడా ఇలా చేస్తే బాగుంటుంది’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో మీమ్ పేజీ మొదలుపెట్టా. వారానికి రెండు మూడు మీమ్స్ పోస్ట్ చేసేవాడ్ని. అవి కొన్ని నెలల్లోనే పాపులర్ అయి, మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పటినుంచి రెగ్యులర్‌గా మీమ్స్ పోస్ట్ చేయడం మొదలుపెట్టా.
ఎందుకు ‘బాబూ నువ్వు బీటెక్కా?’
గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్లను జనాలు ‘... తరువాత ఏం చేస్తావు?’ అని అడుగుతుంటారు. ఇంజినీరింగ్ అయిపోయి ఖాళీగా ఉంటేచాలు ‘ఏం బాబు బీటెక్ చేశావా? ఖాళీగా ఎందుకు ఉండటం’ అని అడుగుతారు. ఆ ప్రశ్నలే ‘బాబూ నువ్వు బీటెక్కా’ అనే పేరు పెట్టేలా చేశాయి.
మీమ్ ఎలా క్రియేట్ చేస్తారు?
నాకు సినిమాలంటే చాలా ఇష్టం. ఎక్కువ చూస్తుంటాను కూడా. ఆ నాలెడ్జ్ వల్ల సిచ్యుయేషన్‌కు తగ్గట్టు ఏ మీమ్‌కి... ఏ ఫొటో తీసుకోవాలో తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్‌తో జరిగిన సిచ్యుయేషన్స్‌నే తీసుకుంటా. వాటి నుంచే ఇంత ఫన్ వస్తుంది. ఇదివరకైతే.. వాటిని గుర్తు పెట్టుకొని, ఇంటికెళ్లి కంప్యూటర్ ముందు కూర్చొని మీమ్స్ క్రియేట్ చేసేవాడ్ని. దానికి చాలా టైం పట్టేది. కానీ, ఇప్పుడు ఫోన్‌తోనే అన్నీ చేస్తున్నా.
పాలిటిక్స్ మీద చేయరనుకుంటా?
అవును. ఎందుకంటే స్టూడెంట్స్ పొలిటికల్ న్యూస్ ఎక్కువ ఫాలో కారని నా ఫీలింగ్. నాకూ పాలిటిక్స్ మీద అంత నాలెడ్జి లేదు. ఒకవేల పాలిటిక్స్ మీద మీమ్స్ చేసినా... నా ఆలోచనలు, మీమ్స్ చూసే వాళ్ల ఆలోచనలు ఒకేలా ఉండకపోవచ్చు.
మీమ్స్ కాంట్రవర్సీ అయ్యాయా?
అలా అప్పుడప్పుడు అవుతుంది. నా పోస్ట్ ప్రతీ ఒక్కరికి నచ్చాలనేం లేదు. అలా నచ్చని వాళ్లు మెసేజ్ చేస్తూ, కామెంట్స్ చేస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌కు రిపోర్ట్ ఇవ్వడం వల్ల అప్పుడప్పుడు కాపీ రైట్స్ ఇష్యూస్ వస్తుంటాయి. కొన్ని రోజుల వరకు బ్యాన్ కూడా అవుతుంటుంది.
సినిమా ఫీల్డ్‌కి వెళ్లే ఆలోచన ఉందా?
చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగా. ఏదో ఒక రోజు సినిమా చేయాలనే గోల్ ఉంది. అందుకే దాని కోసం ప్రయత్నిస్తున్నా. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌కు, కాన్సెప్ట్ వీడియోలు చేసేవాళ్లకు స్ర్కిప్ట్స్ రాస్తుంటా. అవకాశం వస్తే సినిమాలకు స్టోరీ రాస్తా.
రెవెన్యూ వస్తుందా?
ఇన్‌స్టాగ్రామ్ నుంచి అయితే కొంతవరకు వస్తుంది. ఆ డబ్బు నా చిన్న చిన్న అవసరాలకి ఉపయోగపడుతుంది. కొన్ని సినిమాలను ప్రమోట్ చేస్తుంటా. అలా కూడా కొంత ఆదాయం వస్తుంది. మార్కెటింగ్ కంపెనీలో జాబ్ చేస్తున్నా.
స్పెషల్‌గా వెబ్ పేజీ ఎందుకు?
ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది స్టూడెంట్స్ ‘ఎగ్జామ్స్ టైం టేబుల్ ఎప్పుడొస్తుంది? రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి? ఫీజ్ కట్టడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు?’ అని రకరకాల ప్రశ్నలతో మెసేజ్ చేస్తుంటారు. అందుకే ‘బాబూ నువ్వు బీటెక్కా’ వెబ్ పేజీ కూడా స్టార్ట్ చేశా. అందులో వాళ్లకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంటా.
సోషల్ వర్క్స్ కూడా..
మీమర్ అనేవాడు నవ్వించడమే కాదు, సోషల్ యాక్టివిటీస్ కూడా చేయొచ్చు. వీటితో ప్రజల్లో కొంతవరకు అవగాహన తీసుకురావచ్చు. అందుకే కొవిడ్ టైంలో అవేర్‌నెస్, బయట పరిస్థితి ఎలా ఉంది అనే విషయాల మీద మీమ్స్ చేశా. స్టూడెంట్స్ పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకొని బస్ ఫెసిలిటీ కల్పించాలని, వాళ్లకు కనీస అవసరాలు కల్పించాలని, ఎగ్జామ్స్, కాలేజీ ఫీజ్ విషయాలపై చాలా మీమ్స్ చేశా. వాటిమీద చేసిన మీమ్స్ పబ్లిక్‌కి బాగా రీచ్ అయ్యాయి. అధికారులు రెస్పాండ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.’’
::: కొలనుపాక భరత్