రణరంగం రివ్యూ

రణరంగం రివ్యూ

గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌ డ్రామాలకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. కానీ ఇప్పటివరకూ వచ్చినవన్నీ సక్సెస్ అయ్యాయా అంటే అవునని అనలేం. అయినా కూడా శర్వానంద్‌‌ని గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌గా మార్చి ‘రణరంగం’లోకి దింపాడు సుధీర్‌‌‌‌వర్మ. అతడి ప్రయత్నం ఫలించిందా?

కథ

తన స్నేహితులతో కలిసి బ్లాక్‌‌ టికెట్స్ అమ్ముకుంటూ బతికే కుర్రాడు దేవా (శర్వానంద్). తమ బస్తీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అడ్డు పడిపోతుంటాడు. ఆ క్రమంలో కొందరితో శత్రుత్వం ఏర్పడుతుంది. మద్యపాన నిషేధ సమయంలో లిక్కర్ వ్యాపారంలోకి దిగి, ఏకంగా ఎమ్మెల్యేతోనే తలపడటంతో శత్రుగణం మరింత పెరుగుతుంది. ఈ క్రమంలో గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌గా అవతరిస్తాడు కానీ అయినవాళ్లని పోగొట్టుకుంటాడు. అందరికీ దూరంగా వెళ్లి బతుకుదామనుకున్నా గతం వెంటాడుతూ ఉంటుంది. అందులోంచి అతడు బయటికి వచ్చాడా,ప్రశాంతంగా జీవించగలిగాడా అన్నది మిగతా కథ.

విశ్లేషణ

గ్యాంగ్‌‌స్టర్ మూవీకి మొదట ఉండాల్సింది బలమైన ప్లాట్. ఒక మామూలు వ్యక్తి గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌గా ఎలా ఎదిగాడు అనేది చాలా బలమైన సన్నివేశాలతో చూపించాల్సి ఉంటుంది. ఆ విషయంలో దర్శకుడు తెలివైన నిర్ణయమే తీసుకున్నాడు. ఎవరూ అంతగా టచ్ చేయని ఇల్లీగల్ లిక్కర్ రవాణాని ఎంచుకున్నాడు. నిషేధం ఉన్న సమయంలో మద్యాన్ని ఎలా అమ్మేవారు అనే విషయాన్ని చాలా బాగా చూపించాడు. దానికి తోడు అక్కడ లీడ్‌‌ రోల్‌‌లో ఉన్నది శర్వా కావడంతో మరింత బాగుంది చూడటానికి. కళ్యాణితో ప్రేమ సన్నివేశాలు, హీరో ఫ్రెండ్స్‌‌ కామెడీ వంటివి కూడా అలరిస్తాయి. కాకపోతే వచ్చిన సమస్యల్లా ఒక్కటే.. హీరో ఎలివేషన్ మీద పెట్టిన శ్రద్ధ సన్నివేశాల మీద పెట్టకపోవడం. అందరు గ్యాంగ్‌‌స్టర్స్‌‌లా కాకుండా శర్వానంద్‌‌ ఏదైనా కొత్తగా చేస్తాడేమో అని చూసినవారికి నిరాశ కలిగే అవకాశం లేకపోలేదు. వరుసగా పేర్చుకుంటూ పోయిన సన్నివేశాలు ఏమాత్రం ఉత్కంఠ రేపకపోగా… కొన్నిసార్లు మనం గెస్ చేసేస్తాం కూడా. అన్నీ వదిలేసి దూరంగా వెళ్లిపోవడానికి ఉన్న కారణాన్ని చూపించిన దర్శకుడు… అక్కడికి వెళ్లాక కూడా ఎందుకు ఇదే లైఫ్‌‌ లీడ్ చేస్తున్నాడన్నది సరిగ్గా చూపించ

లేదు. బ్యాక్‌‌ అండ్ ఫోర్త్ స్క్రీన్‌‌ ప్లేని వాడుకుని కాసిన్ని సర్‌‌‌‌ప్రైజింగ్ ట్విస్టులు పెట్టినా ఫ్లాట్‌‌గా సాగుతున్న ఫీలింగ్ వచ్చేది కాదు. దానికి తోడు ఇంకా ఏదో జరుగుతుంది అని ఆసక్తిగా చూస్తున్న సమయంలో సినిమాని చప్పున ముగించేసి ఉసూరుమనిపించాడు. ఈ విషయాల్లో కాస్త కేర్ తీసుకుని ఉంటే నాయకుడు, బాషాల తర్వాత మరో మంచి గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌ డ్రామాని చూసివుండేవాళ్లం. ఎందుకంటే అక్కడ ఉన్నది శర్వానంద్ లాంటి అద్భుతమైన నటుడు కాబట్టి.

ఎవరెలా?

పర్‌‌‌‌ఫార్మెన్స్‌‌ పరంగా ఎప్పుడూ వంక పెట్టే అవకాశం ఇవ్వడు శర్వానంద్. ఈ సినిమాలో కూడా అలాంటి ప్రయత్నం చేయడం వృథా. ఇంత హ్యాండ్‌‌సమ్ గ్యాంగ్‌‌స్టర్‌‌‌‌ని ఎప్పుడూ చూసివుండరు ప్రేక్షకులు. లైఫ్‌‌లోని రెండు దశల్లో కూడా లుక్స్ పరంగా, నటన పరంగా అదరగొట్టేశాడు. కళ్యాణి కూడా అతని పక్కన క్యూట్‌‌గా కనిపించింది. కాజల్ కూడా బాగుంది కానీ ఆమె పాత్ర నిడివి ఇంకాస్త ఉంటే బాగుండేది. హీరో ఫ్రెండ్స్‌‌గా నటించిన వారంతా తమ పరిధి మేర చక్కగా నటించారు. మురళీశర్మ పాత్ర లుక్స్, మేనరిజమ్స్‌‌ పరంగా కాస్త కొత్తగా ఉంది తప్ప మిగతా నెగిటివ్ పాత్రధారులంతా మామూలుగానే అనిపించారు.

ఇక టెక్నికల్ అంశాలను చూసుకుంటే… అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. లొకేషన్స్‌‌ దగ్గర్నుంచి ప్రతిదీ ఎంతో రిచ్‌‌గా ఉంది. విజువల్స్‌‌, బ్యాగ్రౌండ్‌‌ స్కోర్‌‌‌‌ రెండు పర్‌‌‌‌ఫెక్ట్‌‌గా కుదరడంతో కళ్లకు ప్రతి ఫ్రేమ్ అందంగా కనిపిస్తుంది. చెవులకు ప్రతి శబ్దం చక్కగా వినిపిస్తుంది. కొన్ని చోట్ల మాటలు బాగా పేలాయి. పాటలకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ బాగున్నాయి. ఇన్ని అంశాలు చక్కగా కుదిరిన ఈ సినిమాకి కంటెంట్ పరంగా కూడా ఇంకాస్త బలం చేకూరి ఉంటే రణరంగంలో గెలుపు మరింత భారీగా ఉండేది.