
చిట్యాల వెలుగు: కారును వెనుక నుంచి కంటెయినర్ ఢీకొట్టడంతో అది ముందు వెళ్తున్న బస్సు కిందికి దూసుకుపోయింది. ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో జాతీయ రహదారి 65పై ఆదివారం జరిగింది. చిట్యాల ఎస్సై ధర్మ తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ పట్టణానికి చెందిన సయ్యద్ నవాజ్ (28), ఎండీ. జుబేర్ (20), షోయబ్ ముస్తఫా, సల్మాన్ కలిసి వెల్డింగ్ పని కోసం హైదరాబాద్ వెళ్లారు. అక్కడ పని ముగించుకొని ఆదివారం కారులో తిరిగి నల్గొండకు వస్తున్నారు.
పెద్దకాపర్తి గ్రామ శివారులోకి రాగానే వెనుక నుంచి వచ్చిన కంటెయినర్ కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు ముందు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కిందికి దూసుకెళ్లింది. కారు నుజ్జునుజ్జు కావడంతో ముందు కూర్చున్న సయ్యద్ నవాజ్, ఎండి జుబేర్ అక్కడికక్కడే చనిపోగా, వెనుక సీట్లో ఉన్న ముస్తఫా, సల్మాన్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వారిని నల్గొండలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ధర్మ తెలిపారు. కాగా కంటెయినర్ వెనుక వచ్చిన మరో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ కారులో ఎవరికీ గాయాలు కాలేదు.