ఎన్నికల్లో గెలుపుకు ప్రతి ఓటూ విలువైనదే. ఒక్క ఓటు తేడాతో ఓడినోళ్లు ఎందరో. అలాగే.. ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ సాధించటమూ చాలా ముఖ్యం. అసెంబ్లీ ఎన్నికల పోరుకు తెర లేచిన ఢిల్లీలో ఈ రెండు అంశాలకూ తెలుగోళ్లే కీలకంగా మారారు. ఆ రాష్ట్ర జనాభాలో మనోళ్లు దాదాపు 6 శాతం ఉండటం, మొత్తం 70 సెగ్మెంట్లలో 8 చోట్ల వీళ్లది పైచేయి కావటమే దీనికి కారణం. దీంతో మూడు ప్రధాన పార్టీలు ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ ప్రజలను ఆకట్టుకోవటానికి ప్రయారిటీ ఇస్తున్నాయి. మేనిఫెస్టోల్లో ప్రత్యేక హామీలు గుప్పిస్తున్నాయి.
కేపిటల్ సిటీకి జనం అన్ని వైపుల నుంచి వచ్చి పోతుంటారు. అక్కడి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడినవాళ్లుంటారు. అలాంటివాళ్లు స్థానికంగా జరిగే ఏ ఎలక్షన్‌లోనైనా కీలకమవుతారు. ఢిల్లీతోపాటు దాని పరిసరాల్లో దాదాపుగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినవాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, సాఫ్ట్ వేర్, ఇతర ఉపాధి రంగాల్లోని జనాలు ఢిల్లీలో ఉంటారు. వీళ్లలో పూర్వాంచల్, తెలంగాణ, ఏపీ, పంజాబ్, తదితర రాష్ట్రాలకు చెందినవాళ్లు ఎక్కువమంది ఓటర్లుగా ఉన్నారు. 2019 లోక్‌సభ ఓటర్ల జాబితా ప్రకారం సుమారు కోటి 43 లక్షల మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం మరో మూడు లక్షల మంది కొత్తగా నమోదయ్యారు.
ఢిల్లీలో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ట్రయాంగిల్ పోరు ఏర్పడింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీలో అధికారంలో ఉండగా, బీజేపీ కేంద్రంలో ఎన్డీయే సర్కారును నడిపిస్తోంది. ఈ రెండింటి మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్‌దే ఢిల్లీలో ఫుల్ హవా. 15 ఏళ్ల పాటు షీలా దీక్షిత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగింది. అయితే, ఆరేళ్లుగా కాంగ్రెస్ డీలా పడిపోయింది. అధికార పార్టీ ఆప్ తాను చేసిన అభివృద్ధిని నమ్ముకుంటే, బిజేపీ తనకు రాష్ట్రాల్లో ఎదురవుతున్న ఎదురుదెబ్బల నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ గత ఏడాది చాలా రాష్ట్రాల్లో మళ్లీ అధికారానికి రాగలిగింది. బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో 303 సీట్లు రావడం మినహా మరెక్కడా చెప్పుకోదగ్గ సక్సెస్ లేదు. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకోవాలని కాంగ్రెస్, ఆప్ వ్యూహాలు పన్నుతున్నాయి. అయితే, అటు ఆప్, ఇటు బీజేపీ రెండూ అధికార పార్టీలే అయినందువల్ల వాటిపై జనాలకున్న నెగెటివ్ ఒపీనియన్‌కి తనకు అనుకూలంగా మార్చుకోవాలని కాంగ్రెస్ అనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఎవరు ఢిల్లీ పీఠం దక్కించుకోవాలన్నా… నాన్–లోకల్ ఓటర్లను పట్టించుకోక తప్పదు.
నేతలపై తెలుగు ప్రభావం
ఢిల్లీలో తెలుగు ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆంధ్ర అసోసియేషన్, ఢిల్లీ తెలుగు అకాడమీ, ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ, తెలుగు యూత్, ఇలా అనేక అసోసియేషన్ల లెక్కల ప్రకారం దాదాపు 8 లక్షలకు పైగా తెలుగువాళ్లు ఉంటారని తేలింది. ఢిల్లీ ఓటర్ల జాబితాలో దాదాపు 5.5 శాతం పైగానే తెలుగువాళ్లున్నట్లు లెక్క. ఇది మొత్తం ఓట్లలో చాలా చిన్న శాతమే అనిపించవచ్చు. ముఖ్య నేతల తలరాతలు మార్చడంలో తెలుగువాళ్లు వేసే ఓట్లే కీలకమవుతాయి. ఆప్ అధినేత, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం తెలుగువాళ్లను పక్కన పెట్టలేరు. ఆయన పోటీ చేస్తున్న సెంట్రల్ ఢిల్లీ నియోజకవర్గంలోనే ఏపి, తెలంగాణలకు చెందిన భవన్ ఉంది. దీంతో పాటు ఢిల్లీ వెస్ట్, ఈస్ట్, సౌత్ మొత్తం 6 నుంచి 8 నియోజకవర్గాల్లో తెలుగు వాళ్ల సంఖ్య ఎక్కువే. మరీ ముఖ్యంగా ఢిల్లీలోని సుల్తాన్ పురిలో తెలుగువాళ్లకు ప్రత్యేకంగా ఒక కాలనీయే ఉంది. మెదక్ నుంచి పోటీ చేసి మళ్లీ ప్రధానమంత్రి అయ్యాక, తన విజయానికి గుర్తుగా ఇందిరాగాంధీ ఈ కాలనీని ఏర్పాటు చేశారు. ఇక్కడ తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. షాద్రా, మయూర్ విహార్, లజ్‌పత్ నగర్, సరితా విహార్, ద్వారక, వికాస్పురి, కేశవపురం, రోహిని, మునిర్కా, వసంత్ విహార్… ఇలా చాలా ప్రాంతాల్లో తెలుగు ఓటర్లు విస్తరించి ఉన్నారు. అందువల్లే, అధికార ఆప్సహా, బిజేపి, కాంగ్రెస్ పార్టీలు కూడా తెలుగు ఓటర్లకు ఎప్పుడూ పెద్ద పీట వేస్తాయి.
‘తెలుగు’కు ప్రత్యేక స్థానం
ఢిల్లీలోని తెలుగు ఓటర్లు జారిపోకుండా… రాజకీయ పార్టీలు, నేతలు ఎప్పుడూ స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మొదలుకొని… తాజాగా సిఎం కేజ్రీవాల్ దాకా అందరూ తెలుగు ప్రజలను గౌరవంగానే చూస్తున్నారు. కేజ్రీవాల్ తన ప్రచారంలో తెలుగు భాష, సంస్కృతుల అభివృద్ధికి ‘తెలుగు అకాడమీ’ని ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా తెలుగు అసోసియేషన్లు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో పాటు, తెలుగు ప్రాంతాల నుంచి సీనియర్ బిజేపీ నేతలను రప్పిస్తోంది. ఢిల్లీ ప్రచారంలో ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
ఢిల్లీలో తెలుగువాళ్ల ప్రభావం
- ‘తెలుగు అకాడమీ’ ఏర్పాటు చేస్తా: కేజ్రీ
- కేజ్రీవాల్ నియోజక వర్గంలోనే తెలంగాణ, ఏపి భవన్.
- దాదాపు 8 సీట్లలో తెలుగు ఓటర్లదే కీలక నిర్ణయం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ఐటి రంగం, ఇతర ఉపాధి, వ్యాపారాల్లో తెలుగువాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
- ఇందిరాగాంధీ తెలుగువాళ్లకు థ్యాంక్స్ చెప్పడానికి కాలనీ ఏర్పాటు
- ఆమె హయాంలో ఏర్పడిన సుల్తాన్ పురి తెలుగు కాలనీ.
- షాద్రా, మయూర్ విహార్, లజ్‌పత్ నగర్, సరితా విహార్, ద్వారక, వికాస్పురి, కేశవపురం, రోహిని, మునిర్కా, వసంత్ విహార్లలో ఎక్కువగా తెలుగు ఓటర్లు
అందరికీ మనం కావల్సిందే
ఆంధ్రా అసోసియేషన్ ఢిల్లీలో కల్చరల్‌గా, పొలిటికల్‌గా చాలా యాక్టివ్‌గా ఉంటోంది. నేను దాదాపు 40 ఏళ్లుగా ఢిల్లీలోనే ఉంటున్నా. ప్రతి పార్టీ తమ మేనిఫెస్టోలో తెలుగువాళ్లకోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. వాళ్లకు సంబంధించిన అంశాలకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ తెలుగు అకాడమీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కేబినెట్ కూడా ఈ ప్రపోజల్‌ను ఆమోదించినట్లు తెలిసింది. షీలా దీక్షిత్ సీఎంగా ఉన్న రోజుల్లోనూ తెలుగు వాళ్లకోసం ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్నారు.– కోటగిరి సత్యనారాయణ, ఆంధ్ర అసోసియేషన్ సెక్రటరీ
తెలంగాణ వారి సంఖ్య పెరిగింది
దాదాపు 15 ఏళ్లకు పైగానే ఢిల్లీలో ఉంటున్నాం. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) లో నా భర్త ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో తెలంగాణకు చెందినవారు ఎక్కువగా ఢిల్లీలో స్థిరపడ్డారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణవాళ్లకు ఇక్కడ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా కొందరు నేతలు వచ్చి, ప్రచారం చేశారు. ఈసారికూడా వస్తారని అంటున్నారు. – నిర్మల, పతంజలి యోగ, ఢిల్లీ వైస్-ప్రెసిడెంట్