ఉద్యోగుల బదిలీపై..తెలంగాణ సర్కారుతో చర్చిస్తున్నం

ఉద్యోగుల బదిలీపై..తెలంగాణ సర్కారుతో చర్చిస్తున్నం
  • వన్ టైమ్ రిలీవ్ కోసం విజ్ఞప్తి చేశాం
  • ఏపీ అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడి  

హైదరాబాద్, వెలుగు: రెండు తెలుగు రాష్ట్రాల  మధ్య అంతరాష్ట్ర  ఉద్యోగుల బదిలీపై తెలంగాణ ప్రభుత్వ సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని ఏపీ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ తెలిపారు. మంగళవారం ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ అవర్ సందర్భంగా ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లేందుకు 1,942 మంది ఉద్యోగులు, అధికారులు ఆప్షన్లు ఇచ్చారని.. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేందుకు 1,447 మంది ఆప్షన్లు ఇచ్చారని చెప్పారు. ఈ ఏడాది ఆగస్టులో 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, అధికారులను ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసిందన్నారు. 

తెలుగు  రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి రెండు  రాష్ట్రాల సీఎంలు ఇటీవల భేటీ అయ్యారని తెలిపారు. సమస్యల పరిష్కారానికి రెండు ప్రభుత్వాలు ఉన్నతాధికారులతో కమిటీలు ఏర్పాటు చేశాయని, త్వరలోనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి చెప్పారు. 

సేమ్ క్యాడర్ బదిలీలకు ఓకే: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ
  
ఆర్ధిక మంత్రి ప్రకటనపై ఉద్యోగుల జేఏసీ నేతలు స్పందిస్తూ.. రెండు రాష్ట్రాల మధ్య సమాన క్యాడర్ ఉద్యోగుల బదిలీకి తాము అంగీకరిస్తామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. ఇక్కడి నుంచి చిన్న క్యాడర్ ఉద్యోగులు ఏపీకి వెళ్లి,  ఏపీ నుంచి ఉన్నతాధికారులు తెలంగాణకు వస్తే మాత్రం ఒప్పుకోబోమన్నారు. అలా వస్తే ఇక్కడి ఉద్యోగులకు, నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని నేతలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, తెలంగాణ స్థానికత ఉండి ఏపీ నుంచి వచ్చే ఉద్యోగులను తీసుకునేందుకు ఇక్కడి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. త్వరలోనే ఈ అంశంపై మరోసారి ఉన్నతాధికారులను కలుస్తామని నేతలు తెలిపారు.