తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాన్ ముప్పు .. రెండు రోజులు అత్యంత భారీ వర్షాలు

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీ, ఒడిశా తీరప్రాంతాలకు చేరువలో తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తున మరో తుపాను ఆవర్తనం కూడా ఏర్పడినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. వీటి ప్రభావంతో  రేపు, ఎల్లుండి(జులై 27,28)   అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణలో ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్, 10 జిల్లాలకు ఆరెంజ్, మరో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది. గడిచిన 24 గంటల్లో నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో కుంభవృష్టిగా వర్షాలు కురిశాయి. వేల్పూర్ లో అత్యధికంగా 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.


జక్రాన్‌పల్లి, భీంగల్‌లో 23, వరంగల్‌ జిల్లా సంగెంలో 22, నెల్లబల్లిలో 17, హనుమకొండ జిల్లా ఆత్మకూర్‌ లో 17, జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ లో 16, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండలో 14, సాయంపేట, పరకాల, మోర్తాడ్‌, ఆర్మూర్‌ లలో 14, వరంగల్‌ జిల్లా పర్వతగిరి, ములుగులో 13, బోనకల్‌, పాలకుర్తి, డోర్నకల్‌ లలో 12, చెన్నారావుపేట, శ్రీరాంపూర్‌, కూసుమంచి, మహబూబాబాద్‌ లలో 11సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ALSO READ :ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తిన అధికారులు..మూసీకి భారీగా వరద

 

మరోవైపు ఏపీలోనూ కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశానికి చిల్లి పడిందా అన్నట్టుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మరోమూడు రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణశాఖ హెచ్చరించింది. పల్నాడు, ఎన్టీఆర్, కర్నూల్, నంద్యాల, ప.గో, అల్లూరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.