న్యూఢిల్లీ: మన దేశానికి చెందిన స్టూడెంట్ శ్రేయాస్ రెడ్డి బెనిగర్(19) అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఓహియో స్టేట్‌లో శుక్రవారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అతడి మృతికి కారణాలేంటో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. శ్రేయాస్‌కు అమెరికన్ పాస్‌పోర్ట్ ఉందని, విద్వేశపూరిత దాడి అయ్యుండకపోవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన శ్రేయాస్ ఓహియోలోని లిండర్ బిజినెస్ స్కూల్లో చదువుతున్నాడు. శ్రేయాస్ చనిపోయాడని అధికారులు ఇచ్చిన సమాచారంతో అతడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. శ్రేయాస్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై న్యూయార్క్‌లోని ఇండియన్ కాన్సులేట్ కూడా విచారం వ్యక్తం చేసింది.
అతడి కుటుంబానికి అండగా ఉంటామని ట్వీట్ చేసింది. కాగా, అమెరికాలో చదువుకుంటున్న మన స్టూడెంట్లు గడిచిన నెల రోజుల్లోనే నలుగురు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. పర్డూ యూనివర్సిటీలో చదువుతున్న నీల్ ఆచార్య గత సోమవారం అనుమానాస్పదస్థితిలో అదే క్యాంపస్‌లో చనిపోయాడు. హర్యానాకు చెందిన వివేక్ సైనీ(25) జార్జియాలో ఎంబీయే పూర్తి చేసి పార్ట్ టైం పనిచేసుకుంటున్నాడు. అక్కడ, దిక్కూమొక్కులేని ఓ వ్యక్తికి ఆశ్రయం కల్పిస్తే, అతడే జనవరి 16న సైనీని కొట్టి చంపేశాడు. అకుల్ ధావన్(18) అనే మరో స్టూడెంట్ ఇల్లినాయీ యూనివర్సిటీ బయట అనుమానాస్పదస్థితిలో మరణించాడు. సిన్సినాటి యూనివర్సిటీలో ఆదిత్య(26) అనే పీహెచ్డీ స్టూడెంట్ను ఇటీవలే దుండగులు కాల్చి చంపేశారు.