- మే 25 నుంచి కనిపించకుండా పోయిన నితీషా కందుల
హ్యూస్టన్: అమెరికాలో భారతీయ విద్యార్థుల మిస్సింగ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా, హైదరాబాద్ కు చెందిన నితీషా కందుల(23) అనే విద్యార్థిని కనిపించ కుండా పోయింది. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలోని శాన్ బెర్నార్డినో (సీఎస్యూఎస్బీ)లో ఆమె మాస్టర్స్ చేస్తోంది. గత నెల 28వ తేదీ నుంచి కనిపించట్లేదని పోలీసులు తెలిపారు.
నితీషా చివరిసారిగా లాస్ ఏంజిలిస్ లో టయోటా కారు నడుపుతూ కనిపించిందని సీఎస్యూఎస్బీ పోలీసులు వెల్లడించారు. ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ట్వీట్చేశారు. ఇదిలా ఉండగా.. గత నెల 26 ఏండ్ల రూపేశ్ చంద్ర చింతకింది అనే ఇండియన్ స్టూడెంట్ షికాగోలో తప్పిపోయాడు. అలాగే, ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్లోని నాచారానికి చెందిన విద్యార్థి మహ్మద్ అబ్దుల్ అర్ఫత్(25) అదృశ్యమయ్యాడు.
కొన్నిరోజుల తర్వాత అర్ఫత్ మృతదేహాన్ని పోలీసులు క్లీవ్లాండ్లో గుర్తించారు. మాస్టర్స్ చేసేందుకు గతేడాది మేలో అర్ఫత్ అమెరికా వెళ్లాడు. క్లీవ్ల్యాండ్ యూనివర్సిటీలో చేరి చదువుకుంటున్నాడు. మార్చిలో భారత్ కు చెందిన 34 ఏండ్ల క్లాసికల్ డ్యాన్సర్ అమర్నాథ్ ఘోష్ మిస్సౌరీలోని సెయింట్ లూయీలో హత్యకు గురయ్యాడు.
పర్డ్యూ యూనివర్సిటీలో 23 ఏండ్ల భారతీయ- అమెరికన్ విద్యార్థి సమీర్ కామత్ ఫిబ్రవరి 5న ఇండియానాలో శవమై కనిపించాడు. ఫిబ్రవరి 2న భారత సంతతికి చెందిన ఐటీ ఎగ్జిక్యూటివ్ వివేక్ తనేజా(41) వాషింగ్టన్లోని ఒక రెస్టారెంట్ వెలుపల జరిగిన దాడిలో ప్రాణాపాయస్థితికి చేరుకున్నాడు.