అమెరికా.. అమెరికా.. ఏదో ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ కొట్టేసి.. ఎంచక్కా ప్లయిట్ ఎక్కి.. ఏదో వారానికి మూడు, నాలుగు గంటలు కాలేజీకి వెళుతూ.. మిగతా టైం అంతా పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ.. ఇండియాలో చేసిన అప్పులను తీర్చేస్తూ.. ఓ నాలుగేళ్లు కష్టపడితే జీవితం సెటిల్ అయిపోయింది.. ఇదీ ఇప్పటి వరకు అమెరికా వెళుతున్న తెలుగు స్టూడెంట్స్ ఆలోచన.. కొన్నేళ్లుగా ఇదే తరహాతో లక్షల మంది స్టూడెంట్స్ ఇలా వెళ్లి.. అమెరికాలో అలా సెటిల్ అయిపోయారు.. ఇప్పుడు సీన్ రివర్స్.. అమెరికా వెళ్లిన తెలుగు స్టూడెంట్స్ పై ట్రంప్ ఎఫెక్ట్ పడింది. ఇన్నాళ్లు అమెరికా నుంచి ఎంతో కొంత ఇండియాలోని ఇళ్లకు డబ్బులు పంపించిన స్టూడెంట్స్.. ఇప్పుడు ఇంటి నుంచే ఎంతో కొంత పంపించండి అనే వరకు వచ్చేశారు. అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే.. రూల్స్ కఠినంగా అమలు చేయటమే కాదు.. ఇల్లీగల్ గా ఎవరైనా ఉద్యోగాలు చేస్తుంటే అమెరికా గడ్డ నుంచి తరిమేస్తాం అంటూ వార్నింగ్ ఇవ్వటంతో ఇప్పుడు తెలుగు స్టూడెంట్స్ పరిస్థితి గందరగోళంలో పడింది.
ఇంతకీ F1 వీసా రూల్స్ ఏం చెబుతున్నాయంటే :
>>> అమెరికా సీఐఎస్ నిబంధలకు లోబడి.. క్యాంపస్ పరిధిలో వారానికి 20 గంటలు మాత్రమే పని చేయాలి.. క్యాంపస్ వెలుపల పని చేయాలంటే కచ్చితంగా క్యాంపస్ అనుమతి తీసుకోవాలి. క్యాంపస్ అంటే ఆ కాలేజీ పర్మిషన్.
>>> ఏ కాలేజీలో అయితే చదువుకుంటున్నారో.. ఆ కాలేజీకి రెగ్యులర్ గా అటెండ్ కావాలాలి. హాజరువేయించుకోవాలి. ఇష్టమొచ్చినట్లు డుమ్మా కొడతాం అంటే కుదరదు.
>>> మీరు F1 వీసాపై చదువుకోవటానికి వెళ్లినప్పుడు.. మీ భార్య, పిల్లలను F2 వీసాపై తీసుకెళ్లవచ్చు. అలా వెళ్లినవారు ఇప్పటి వరకు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఇక నుంచి F2 వీసాపై వెళ్లిన వారు ఉద్యోగం చేయటానికి అవకాశం లేదు.
>>> F1 వీసాలపై వెళ్లిన వారు గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు.
తెలుగు రాష్ట్రాల నుంచి చదువుల కోసం F1 వీసాపై వెళ్లే వారిలో 90 శాతం మంది ఇటు చదువుకుంటూ.. అటు అనధికారికంగా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.
ఇప్పుడు ట్రంప్ కఠినమైన ఆదేశాలతో తెలుగు స్టూడెంట్స్ అందరూ పార్ట్ టైం ఉద్యోగాలకు గుడ్ బై చెబుతున్నారు.
ఒక వేళ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ దొరికిపోతే.. డిగ్రీ క్యాన్సిల్ చేయటమే కాకుండా ఇండియాకు తిరిగి పంపించే అవకాశం ఉంది.
ఈ భయంతో ఇప్పుడు చాలా మంది తెలుగు స్టూడెంట్స్.. తమ తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి డబ్బులు పంపించమని కోరుతున్నారు.
పార్ట్ టైం ఉద్యోగాలు చేయకుండా.. కేవలం చదువుకుంటూనే ఉండాలంటే.. ప్రతినెలా ఇళ్ల నుంచి లక్ష రూపాయల వరకు అమెరికాకు పంపించాల్సి ఉంటుంది. కనీసం వెయ్యి డాలర్లు లేకుండా బతకటం కష్టం.
ALSO READ | ట్రంప్కు కోర్టు షాక్ : పుట్టిన పిల్లలకు పౌరసత్వం రద్దుకు బ్రేక్.. తాత్కాలిక రిలీఫ్
వారానికి 20 గంటలు.. క్యాంపస్ అనుమతితో పార్ట్ టైం ఉద్యోగం చేసినా.. నెలకు అటూ ఇటూగా లక్ష రూపాయల వరకు వచ్చినా.. అవన్నీ కాలేజీ చదువులకు.. ట్రాన్స్ పోర్ట్ కు సరిపోతాయి.. మరి బతకటానికి డబ్బులు కావాలి కదా.. ఉండటానికి, తినటానికి అవసరం అయ్యే డబ్బును ఇప్పుడు ఇంటి నుంచే పంపించాలని కొంత మంది స్టూడెంట్స్ ఇళ్లకు ఫోన్ చేసి చెబుతున్నారంట..
అనధికారికంగా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ దొరికిపోయినా.. ఎవరైనా కంప్లయింట్ చేసి పట్టించినా.. అసలుకే మోసం వస్తుంది. దీంతో చాలా మంది పార్ట్ టైం ఉద్యోగాలను వదిలేసుకుంటున్నారు తెలుగు స్టూడెంట్స్.
2023లో అమెరికా 3 లక్షల 30 వేల మంది F1 వీసాలు ఇస్తే.. అందులో లక్షా 80 వేల మంది స్టూడెంట్స్ ఇండియా నుంచే వెళ్లారు. తెలంగాణ, ఏపీ తెలుగు రాష్ట్రాల నుంచే 30 వేల మంది వరకు ఉండొచ్చు అని అంచనా.
F1 వీసా అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా. స్టూడెంట్స్ అమెరికాలో ఫుల్ టైం చదువుకునేందుకు ఇచ్చే వీసా మాత్రమే. ఆయా కాలేజీ క్యాంపస్ ల అనుమతితో వారానికి.. 20 గంటలు పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవచ్చు. అది కూడా క్యాంపస్ పరిధిలో మాత్రమే. ఇప్పుడు ఈ రూల్ కచ్చితంగా అమలు చేస్తుండటంతో అసలు సమస్య వచ్చింది.