- టాప్ టెన్‌లో తెలంగాణ నుంచి ముగ్గురు, ఏపీ నుంచి ఒకరు
- తెలుగు రాష్ట్రాల నుంచి 9 వేల మంది క్వాలిఫై
- దేశవ్యాప్తంగా 48 వేల మంది స్టూడెంట్స్‌కు అర్హత
- అబ్బాయిలు 40,284, అమ్మాయిలు 7,964 మంది
- నేషనల్ టాపర్‌గా ఢిల్లీ విద్యార్థి వేద్ లహోటీ
- ఈసారి పెరిగిన కటాఫ్ పర్సంటైల్.. నేటి నుంచి కౌన్సెలింగ్ షురూ
హైదరాబాద్, వెలుగు: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో తెలుగు విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. టాప్ టెన్‌లో నాలుగు ర్యాంకులను కైవసం చేసుకున్నారు. దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సులో అడ్మిషన్ల కోసం మద్రాస్ ఐఐటీ గత నెల 26న జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ నిర్వహించింది. జేఈఈ మెయిన్స్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా అడ్వాన్స్‌డ్‌కు రెండున్నర లక్షల మందిని ఎంపిక చేశారు. దీంట్లో 1,86,584 మంది రిజిస్టర్ చేసుకోగా, 1,80,200 మంది ఎగ్జామ్ రాశారు. కాగా, ఇందులో 48,248 మంది క్వాలిఫై అయ్యారు. దీంట్లో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 9 వేల మంది వరకు ఉంటారని తెలుస్తోంది. మొత్తం క్వాలిఫై అయిన వారిలో అమ్మాయిలు 7,964 మంది ఉండగా, అబ్బాయిలు 40,284 మంది ఉన్నారు.
టాపర్‌గా ఢిల్లీ స్టూడెంట్
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్ లహోటి 360 మార్కులకుగానూ 355 మార్కులు సాధించి నేషనల్ టాపర్‌గా నిలిచాడు. ఢిల్లీ జోన్‌కు చెందిన ఆదిత్య రెండో ర్యాంకును కైవసం చేసుకున్నాడు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన భోగల్‌పల్లి సందేశ్ మూడో ర్యాంకు, పుట్టి కౌశల్ కుమార్ టాప్ ఐదో ర్యాంకర్‌గా నిలిచారు. కోడూరు తేజేశ్వర్ 331 మార్కులతో 8వ ర్యాంకు, అల్లాడబోయిన ఎస్‌ఎస్‌డీబీ సిద్విక్ సుహాస్ 329 మార్కులతో పదో ర్యాంకు సాధించారు.
వీరిలో సందేశ్, కౌశల్ కుమార్, సిద్విక్ సుహాస్ తెలంగాణలోనే ఇంటర్ పూర్తిచేయగా, తేజేశ్వర్ విజయవాడలో ఇంటర్ చదివాడు. కాగా, రూర్కీ ఐఐటీ పరిధిలో రైతమ్ ఖేడియా 4వ ర్యాంకు, ఐఐటీ ముంబై జోన్ పరిధిలోని రాజ్‌దీప్ మిశ్రా ఆరో ర్యాంకు, ద్విజ ధర్మేశ్‌కుమార్ పాటిల్ ఏడో ర్యాంకు, ధ్రువిన్ హేమంత్ దోషి 9వ ర్యాంకు సాధించారు.
అయితే, టాప్ వంద ర్యాంకుల్లో సుమారు 20 మంది వరకూ తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే ఉన్నారు. ఐదు వందలలోపు ర్యాంకుల్లోనూ తెలుగు విద్యార్థులు భారీగానే ఉంటారని అధికారులు చెప్తున్నారు. కాగా, వుమెన్స్ కేటగిరీలో మద్రాస్ ఐఐటీ జోన్ టాపర్ గా హైదరాబాద్ కు చెందిన శ్రీనిత్య దేవరాజ్ నిలిచింది. ఆమెకు 268 ర్యాంకు వచ్చింది. కరీంనగర్ కు చెందిన దొంతుల సాయివివేక్ 173వ ర్యాంకు సాధించాడు.
కటాఫ్ పెరిగింది
ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్ కటాఫ్ పర్సంటైల్ పెరిగింది. జనరల్ కేటగిరీలో 2023లో 90.7 శాతం మార్కులు కటాఫ్‌గా ఉంటే.. ఈ సారి 93.2 శాతానికి పెరిగింది. ఓపెన్ కేటగిరీలో అర్హత సాధించడానికి కటాఫ్ మార్కులు 109గా ఖరారు చేశారు. రిజర్వేషన్ కేటగిరీలో 54 మార్కులతో క్వాలిఫై అయ్యారు. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు ప్రతీ సబ్జెక్టులోనూ 8.68 శాతం, మొత్తంగా 30.34 శాతం మార్కులతో ర్యాంకుల జాబితాలోకి వెళ్లారు. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు ప్రతీ సబ్జెక్టుల్లో 2.17 శాతం, మొత్తంగా 15.17 శాతం మార్కులతో ర్యాంకుల జాబితాలో నిలిచారు.
నేటి నుంచి కౌన్సెలింగ్
దేశంలోని ఐఐటీలు, జాతీయ ఇంజినీరింగ్ కాలేజీలు (ఎన్‌ఐటీలు), ట్రిపుల్ ఐటీ, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో జేఈఈ ర్యాంకుల ఆధారంగా అడ్మిషన్లు చేపడతారు. సోమవారం నుంచి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు రిలీజ్ చేశారు. బీటెక్, బీఎస్, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్ల భర్తీకి జోసా ద్వారా జాయింట్ కౌన్సెలింగ్ జులై 23వ తేదీ వరకు సాగనున్నది. ఈ ఏడాది 121 విద్యాసంస్థలు ఈ కౌన్సెలింగ్ లో పాల్గొంటాయని అధికారులు తెలిపారు.