సర్కారు జూనియర్​ కాలేజీల్లో తెలుగు గాయబ్.! సెకండ్ లాంగ్వేజిగా సంస్కృతం

సర్కారు జూనియర్​ కాలేజీల్లో తెలుగు గాయబ్.! సెకండ్ లాంగ్వేజిగా సంస్కృతం
  • సెకండ్ లాంగ్వేజిగా సంస్కృతంను తెచ్చే యోచన
  • స్కోరింగ్ పేరుతో ఎంచుకుంటున్న స్టూడెంట్లు 
  • వంతపాడుతున్న ఇంటర్మీడియెట్ అధికారులు 
  • ప్రతి జిల్లాలో రెండు కాలేజీల్లో ప్రారంభించేందుకు ప్రపోజల్ 
  • తాజాగా స్టేట్ వైడ్​గా అమలుచేసే యోచనలో ప్రభుత్వం! 
  • వ్యతిరేకిస్తున్న తెలుగు భాషా అభిమానులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో తెలుగు సబ్జెక్టు మాయమయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. తెలుగుకు పోటీగా సంస్కృతం సబ్జెక్టును సెకండ్ లాంగ్వేజిగా పెట్టాలని ఇంటర్మీడియెట్ అధికారులు నిర్ణయించారు. దీనికి అనుగుణంగా అవసరమైన పోస్టుల వివరాలను పంపించాలని జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇది తెలుగు భాషాభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తోంది. అయితే, గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రిఫరెన్స్ తో సంస్కృతం పెడ్తామని ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించగా.. అప్పట్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తీసుకున్నారు. తాజాగా మరోసారి సంస్కృతం అంశం తెరమీదిగా వచ్చింది. 

స్టేట్​లో 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా.. వాటిలో సుమారు లక్షన్నరకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుతం అన్ని కాలేజీల్లో ఫస్ట్ లాంగ్వేజిగా ఇంగ్లిష్ సబ్జెక్టు ఉండగా.. సెకండ్ లాంగ్వేజిగా హిందీ, తెలుగు సబ్జెక్టులున్నాయి. అయితే, దాదాపు మెజార్టీ ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో సంస్కృతం, హిందీ తదితర సబ్జెక్టులు సెకండ్ లాంగ్వేజీగా ఉన్నాయి. సంస్కృతం సబ్జెక్టు చదివితే వందమార్కులు వస్తాయనే ప్రచారాన్ని కార్పొరేట్ కాలేజీలు చేస్తుండడంతో విద్యార్థులు ఆ సబ్జెక్టు వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో ఇంటర్మీడియెట్ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. స్టేట్​లోని సర్కారు కాలేజీల్లో సంస్కృతం సబ్జెక్టు పెట్టనున్నామని, దీనికోసం అవసరమైన పోస్టుల వివరాలు పంపించాలని జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం ఈ ఉత్తర్వులు తీవ్ర దుమారం లెపుతున్నాయి. 

టెన్త్ దాకా తెలుగు తప్పనిసరి చేసి.. 

గత ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని సర్కారు, ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ 2018లో చట్టం తీసుకొచ్చింది. పదో తరగతి దాకా అన్ని బడుల్లో తెలుగు చెప్పాలని ఆదేశాలిచ్చారు. దీంతో స్టేట్ సిలబస్​ స్కూళ్లతో పాటు సీబీఎస్ఈ, ఐసీఎస్​ఈ, ఐబీ తదితర బోర్డుల బడుల్లోనూ తెలుగు అమలు చేస్తున్నారు. తాజాగా ఇంటర్మీడియెట్​లో సంస్కృతం సబ్జెక్టు తీసుకురావాలని నిర్ణయం తీసుకోవడం విద్యార్థులనూ ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, గతంలోనే ఈ విధానం అమలు చేయాలని భావించినా.. పేరెంట్స్, లెక్చరర్ల నుంచి వ్యతిరేకత రావడంతో అప్పట్లో వెనక్కి తగ్గారు. తాజాగా, అమలు చేయాలని నిర్ణయించడం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది.  

పోస్టుల కోసం ప్రపోజల్స్!

ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం హైదరాబాద్​ సిటీలోని 8 కాలేజీల్లోనే సంస్కృతం సెకండ్ లాంగ్వేజిగా కొనసాగుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. మిగిలిన కాలేజీల్లో తెలుగు కంటిన్యూ అవుతోంది. అయితే, వచ్చే ఏడాది ప్రతి జిల్లా కేంద్రంలోని రెండు కాలేజీల్లో సంస్కృతం సబ్జెక్టు పెట్టుకునేందుకు కొత్త పోస్టులకు అనుమతులు ఇవ్వాలని తాజాగా ఇంటర్మీడియెట్ అధికారులు.. సర్కారుకు ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఎక్కడెక్కడ అవసరమో వివరాలు పంపించాలని జిల్లా ఇంటర్మీడియెట్ అధికారులను కోరారు. ఈ లెక్కన క్రమంగా తెలుగు స్థానంలో సంస్కృతం పెట్టాలని యోచిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇదే జరిగితే.. రెండు, మూడేండ్లలో అన్ని కాలేజీల్లో తెలుగు కనుమరుగయ్యే ప్రమాదం కన్పిస్తోంది. 

సంస్కృతం ఆలోచన మానుకోవాలి: 

రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సెకండ్ లాంగ్వేజిగా సంస్కృతం పెట్టాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సంస్కృతాన్ని వ్యతిరేకిస్తుంటే.. తెలంగాణలో మాత్రం ప్రమోట్ చేయాలని భావించడం సరికాదు. పొరుగు రాష్ట్రాలు మాతృభాషను రక్షించుకునేందుకు పోరాటాలు చేస్తుంటే, ఇక్కడ మాత్రం కనుమరుగు చేసే ఆలోచన చేయడం కరెక్ట్ కాదు. దీన్ని కంటిన్యూ చేస్తే రాష్ట్రంలో మరో హెచ్ సీయూ వివాదంగా మారే అవకాశం ఉంది. 
- మధుసూదన్​రెడ్డి, 
ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్  

తొందరపాటు చర్యలొద్దు: 

సర్కారు కాలేజీల్లో సంస్కృతాన్ని సెకండ్ లాంగ్వేజిగా ప్రవేశపెట్టే విషయంలో తొందరపాటు చర్యలు వద్దు. గత ప్రభుత్వం కూడా ఇలాగే అమలు చేసే యోచన చేసింది. అప్పట్లో అందరి నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. మళ్లీ అదే విధానం అమలు చేయాలనే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎవరితో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదు.
-కొప్పిశెట్టి సురేశ్, 
టీజీజేఎల్​ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి