
Bengaluru News: ఇండియన్ సిలికాన్ వ్యాలీగా గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరులో బతకటం ప్రస్తుతం న్యూయార్క్ లాంటి సిటీలో జీవించే వారికి మాదిరిగా ఖరీదవుతోంది. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు తమ ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం సిటీలో స్థిరపడిన సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్ 1 నుంచి దాదాపు 8 అంశాలు ఖరీదైనవిగా మారిపోవటంతో ప్రజలు ఆ నగరంలో జీవించాలంటేనే భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
వాస్తవానికి నగరంలో ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కొంత ఎక్కువే సంపాదిస్తున్నప్పటికీ అది వారికి కనీస అవసరాలను తీర్చటానికి సరిపోతోంది. ఇదే క్రమంలో 8 అంశాల్లో చేసిన మార్పులు జీవితాన్ని మరింత ఖరీదైనవిగా మార్చేస్తున్నాయని ప్రస్తుతం అక్కడి ప్రజలు వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే..
ముందుగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తాజాగా పాల ధరలను లీటరుకు రూ.4 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. దీని తర్వాత బెంగళూరులో వాటర్ సప్లై బోర్డు దశాబ్ధకాలం తర్వాత సరఫరా చేస్తున్న నీటికి లీటరుకు ఒక పైసా చొప్పున ఛార్జీలను పెంచింది. దీంతో అదనంగా నెలకు రూ.500 వరకు భారం పెరుగుతోంది. ఇదే సమయంలో మెట్లో ధరలు పెరగగా.. కర్ణాటక ప్రభుత్వం బస్సు ఛార్జీలను 15 శాతం పెంచాలని నిర్ణయించింది.
ALSO READ | భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. మార్చి నెలలో రూ.1.96 లక్షల కోట్లు
ఇదే క్రమంలో కర్ణాటక ప్రభుత్వం కరెంటు బిల్లలపై వడ్డనను పెంచుతూ యూనిట్ ఛార్జీని గతంలో ఉన్న రూ.5.96 నుంచి ప్రస్తుతం రూ.6.16కి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇదే క్రమంలో హైవే టోల్ ఛార్జీలను 7 నుంచి 10 శాతం మధ్య పెంపును ప్రకటించింది. దీంతో స్టేట్ అండ్ నేషనల్ హైవేలపై ప్రయాణం ప్రియంగా మారింది. అలాగే బెంగళూరులో పార్కింగ్ స్థలాల్లో కొత్త విధానంతో పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇది రెసిడెంట్ ప్రాపర్టీ యజమానులకు ఏడాదికి రూ.600 వరకు ఖర్చును పెంచనుంది. అలాగే చెత్తపై కూడా కొత్త పన్ను విధించటం అందరినీ అశ్చర్యానికి గురిచేస్తోంది.
డీజిల్ ధరల పెంపు..
ఇక చివరిగా కర్ణాటక ప్రభుత్వం డీజిల్ అమ్మకాలపై విధించే సేల్స్ టాక్స్ పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనిని 21.17 శాతానికి పెంచటంతో లీటరుకు డీజిల్ ధర రూ.2 చొప్పున నిన్నటి నుంచి పెరిగింది. కర్ణాటక ప్రభుత్వం నంబర్ 2021కి ముందు డీజిల్ పై లీటరుకు సేల్స్ టాక్స్ 24 శాతంగా ఉంచిన సంగతి తెలిసిందే. ఇలా ప్రతి దానిపై వడ్డింపులు ప్రజలకు బెంగళూరు నగరంలో జీవితాన్ని మరింత ఖరీదైనదిగా మార్చేస్తోంది.