హైదరాబాద్, వెలుగు : ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో ఆతిథ్య తెలుగు టైటాన్స్ మళ్లీ నిరాశపరిచింది. వరుసగా రెండో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. మంగళవారం రాత్రి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 52–-22 తేడాతో టైటాన్స్‌ను ఓడించింది. జైపూర్ కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 19 పాయింట్లతో విజృంభించాడు. టైటాన్స్ జట్టులో పవన్ సెహ్రావత్ (7 ), విజయ్ మాలిక్ ( 5), ఆశీష్ నర్వాల్ (5) పోరాడినా మిగతా ప్లేయర్లు నిరాశ పరిచారు.
డిఫెన్స్‌లో ఫెయిలైన టైటాన్ ఏకంగా నాలుగుసార్లు ఆలౌటైంది. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్ 57-–36 తేడాతో బెంగళూరు బుల్స్‌ను చిత్తుగా ఓడించింది. యూపీకి ఇది రెండో విక్టరీ కాగా.. బుల్స్‌కు హ్యాట్రిక్ ఓటమి. యూపీ యోధాస్ కెప్టెన్ సురేందర్ గిల్ (17), భరత్ (14) రాణించారు. బుల్స్ తరఫున కెప్టెన్ పర్దీప్ నర్వాల్ (16 ), జతిన్ (9) పోరాడినా ఫలితం లేకపోయింది.