- పీకేఎల్ 11వ సీజన్‌లో తెలుగు జట్టు శుభారంభం
- సూపర్ టెన్‌తో మెరిసిన కెప్టెన్ సెహ్రావత్
హైదరాబాద్, వెలుగు : గత మూడు సీజన్లలో ఆఖరి స్థానంతో నిరాశపరిచిన తెలుగు టైటాన్స్ ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌ను అద్భుత విజయంతో ఆరంభించింది. రైడింగ్‌లో కెప్టెన్ పవన్ సెహ్రావత్ ( 13 పాయింట్లు), డిఫెన్స్ లో క్రిషన్ ధుల్ (6) విజృంభించడంతో శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో 37– 29తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. సెహ్రావత్ లీగ్ లో 1200 రైడ్ పాయింట్ల మైలురాయి చేరుకున్నాడు. బుల్స్ జట్టులో డిఫెండర్ సురీందర్ దహల్ ఐదు, రైడర్ జతిన్ నాలుగు పాయింట్లు సాధించారు.
స్టార్ రైడర్, కెప్టెన్ పర్దీప్ నర్వాల్ (3) నిరాశపరిచాడు. మరో మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ కేసీ 36–28 తేడాతో యు ముంబాపై గెలిచింది. ఢిల్లీ స్టార్ రైడర్ అషు మాలిక్ (10 పాయింట్లు) సూపర్ టెన్ తో ఆకట్టుకున్నాడు. ముంబా ప్లేయర్లు మిర్‌మొహమ్మద్ జఫర్దనేష్ (11), అజిత్ చవాన్ (10) కూడా సూపర్ టెన్స్ చేసినా ఫలితం లేకపోయింది. కాగా, టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ నటులు కార్తీక్ ఆర్యన్, విద్యా బాలన్ హాజరై సందడి చేశారు.
ఆరంభం..ముగింపు మనదే
ఈసారి కొత్త టైటాన్స్‌ను చూస్తారని చెప్పిన కెప్టెన్ సెహ్రావత్ కోర్టులో జట్టును ముందుండి నడిపించాడు. సొంత స్టేడియం, అభిమానుల మద్దతు నడుమ తెలుగు టీమ్ ఆరంభం నుంచే బుల్స్‌పై పైచేయి సాధించింది. తొలి రైడ్‌లోనే సెహ్రావత్ బోనస్ సహా రెండు పాయింట్లు రాబట్టాడు. తర్వాతి రెండు రైడ్లలోనూ పవన్ సక్సెస్ అవ్వగా 5–1తో టైటాన్స్ ముందంజ వేసింది. ఈ దశలో బెంగళూరు బుల్స్ రెండుసార్లు సెహ్రావత్‌ను ట్యాకిల్ చేసి 6–7తో పుంజుకుంది. కానీ, డిఫెండర్లు అంకిత్, క్రిషన్ ధుల్ వరుస ట్యాకిల్స్ చేయడంతో 16వ నిమిషంలో బుల్స్‌ను ఆలౌట్ చేసిన టైటాన్స్ 16–8తో లీడ్‌లోకి వచ్చి 20–11తో ఫస్టాఫ్ ముగించింది.
బ్రేక్ నుంచి వచ్చిన వెంటనే బెంగళూరు జోరు చూపెట్టింది. 29వ నిమిషంలో టైటాన్స్‌ను 22–24 తో నిలిచింది. చివరి పది నిమిషాల్లో తెలుగు టైటాన్స్ మళ్లీ వేగం పెంచింది. కెప్టెన్ పవన్ వరుస రైడ్ పాయింట్లతో సూపర్10 పూర్తి చేసుకోగా.. డిఫెండర్లు సైతం విజృంభించారు. 36వ నిమిషంలో బుల్స్ జట్టును రెండోసారి ఆలౌట్ చేసి గ్రాండ్ విక్టరీ ఖాతాలో వేసుకుంది.
ప్రొ కబడ్డీ లో నేడు
తెలుగు టైటాన్స్ X తమిళ్ తైలవాస్
పుణెరి పల్టాన్ X హర్యానా స్టీలర్స్
రా. 8 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో