తెలుగు యూనివర్సిటీకి సురవరం పేరు

తెలుగు యూనివర్సిటీకి సురవరం పేరు
  • బిల్లుకు అసెంబ్లీ, మండలి ఆమోదం
  • పేర్లు మారిస్తే అగౌరవ పరిచినట్టు కాదు: సీఎం రేవంత్​ రెడ్డి
  • చర్లపల్లి రైల్వే టెర్మినల్‌‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా మారుస్తూ అసెంబ్లీ, మండలిలో ప్రభుత్వం సోమవారం బిల్లు ప్రవేశపెట్టింది. ఈ బిల్లు రెండు సభల్లోనూ ఆమోదం పొందింది. రెండింటిలోనూ మంత్రి దామోదర రాజనర్సింహ బిల్లును ప్రవేశపెట్టగా, సభ్యులు దానిపై చర్చించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు పేరు మార్చినంత మాత్రానా ఆయనను అగౌరవపరిచినట్టు కాదని అన్నారు. 

‘‘తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుతో యూనివర్సిటీలు, సంస్థలు ఉంటే పాలనా పరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెడుతున్నం. రాష్ట్ర విభజన తర్వాత గత కొన్నేండ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ పేరు, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ పేరు, వైఎస్ పేరుతో ఉన్న హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు, వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టుకున్నాం. 

అంతమాత్రానా వాళ్లందరినీ అగౌరవపరిచినట్టు కాదు. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, సంస్థలకు తెలంగాణకు సంబంధించిన పేర్లు పెట్టుకుంటున్నం” అని తెలిపారు. కానీ దీనిపై కొందరు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఈ నిర్ణయానికి కులాన్ని ఆపాదిస్తున్నారు. కొన్ని వర్గాల్లో అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు .

కేంద్ర పదవుల్లో ఉన్నవారు కూడా ఇలా చేయడం సమంజసం కాదు. కుల, మత ప్రాతిపదికన విభజించి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకోవడం కరెక్ట్ కాదు. గుజరాత్‌‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో ఉన్న స్టేడియానికి ప్రధాని మోదీ పేరు పెట్టారు. మేం అలాంటి తప్పిదాలు చేయలేదు.. భవిష్యత్తులోనూ చెయ్యం. రాజకీయాలు కలుషితమయ్యాయో.. నాయకుల ఆలోచనలు కలుషితమయ్యాయో తెలియడం లేదు. 

పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని ఎవరూ తక్కువగా చూడటం లేదు” అని చెప్పారు. చర్లపల్లిలో ఇటీవల నిర్మించిన రైల్వే టెర్మినల్‌‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్‌‌కి లేఖ రాస్తానని తెలిపారు. వాళ్లిద్దరికీ చిత్తశుద్ధి ఉంటే, దీనికి కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు. 

హైదరాబాద్ బల్కంపేటలోని నేచర్ క్యూర్ హాస్పిటల్‌‌కు మాజీ సీఎం రోశయ్య పేరు పెడతామని ప్రకటించారు. ఆ హాస్పిటల్‌‌లో ఆయన విగ్రహం ఏర్పాటు చేసి.. జయంతి, వర్ధంతి అధికారికంగా నిర్వహిస్తామని వెల్లడించారు. రోశయ్య ఉమ్మడి రాష్ర్టంలో 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారని, ఆయన సేవలకు గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 

వ్యతిరేకించిన బీజేపీ ఎమ్మెల్యేలు.. 

తెలుగు యూనివర్సిటీ పేరును మార్చడంపై బీజేపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. పొట్టి శ్రీరాములు పేరును తొలగించటం కరెక్ట్ కాదని, ఆయన పేరునే కొనసాగించాలని ధనపాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. పేరు మార్చాల్సిన అవసరం ఏముందని బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఉస్మానియా యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని సూచించారు. 

తెలుగు భాషకు పర్యాయపదం సురవరం: దామోదర 

సురవరం ప్రతాపరెడ్డి అందించిన సేవలకు గుర్తుగా తెలుగు యూనివర్సిటీకి ఆయన పేరు పెడుతున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆయన అసెంబ్లీ, మండలిలో బిల్లును ప్రవేశపెట్టి మాట్లాడారు. ‘‘1930లో మొట్టమొదటి తెలుగు మహాసభ మెదక్ జిల్లా జోగిపేటలో జరిగింది. తెలంగాణ పోరాట చరిత్ర, తెలుగు భాషకు పర్యాయపదం సురవరం ప్రతాపరెడ్డి” అని కొనియాడారు. పొట్టి శ్రీరాములు  గొప్ప గాంధేయవాది అని, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు.   

ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం: కూనంనేని 

తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడం అభినందనీయమని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. భాషా ప్రాతిపదికన తెలుగు యూనివర్సిటీ ఏర్పడిందని, దీనికి సురవరం పేరు పెట్టడం సరైనదేనని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి చెప్పారు. 

ప్రభుత్వ నిర్ణయం సరైనదేనని, దాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. పేరు మారిస్తే పొట్టి శ్రీరాములును అవమానించినట్టు కాదని, రాష్ట్రం విడిపోయినప్పుడు ఇలాంటి నిర్ణయాలు తప్పవని ఎమ్మెల్సీ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్  అన్నారు. తెలుగు భాష అభ్యున్నతికి సురవరం ప్రతాపరెడ్డి ఎంతో కృషి చేశారని, ప్రభుత్వ నిర్ణయాన్ని తాము సమర్థిస్తున్నామని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ చెప్పారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు.