సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూతతో.. అతని వ్యక్తిగత విషయాలపై ఆసక్తి నెలకొంది. శరత్ బాబుకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరికీ విడాకులు ఇచ్చారు. మొదటి భార్య మాత్రం రమా ప్రభ. అందరికీ తెలిసిన తెలుగు నటి. 1974లో లేడీ కమెడియన్ రమాప్రభను పెళ్లి చేసుకున్న శరత్ బాబు.. 1988లో ఆమెతో విడిపోయారు. 1990లో స్నేహ నంబియార్ అనే మహిళను పెళ్ళాడి 2011లో ఆమెకు కూడా డివోర్స్ ఇచ్చారు.
రమాప్రభ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పదేళ్ల తర్వాత శరత్ బాబు సినీ నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. వీళ్లిద్దరు జంటగా కొన్ని సినిమాల్లో నటించారు. ఆ పరిచయం ప్రేమగా మారి.. 1974లో రెండు కుటుంబాల అంగీకారంతో.. పెళ్లి వరకు వెళ్లింది. కొన్నాళ్లు సాఫీగా సాగిన సంసారం.. తర్వాత మనస్పర్ధల కారణంగా విడిపోయారు. తన డబ్బు, సినిమాల్లో అవకాశాల కోసమే తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు రమాప్రభ ఓ సందర్భంలో వ్యాఖ్యలు చేయటం విశేషం. విడాకుల తర్వాత శరత్ బాబు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోగా.. రమాప్రభ మాత్రం ఒంటరిగా ఉండిపోయింది. వీరికి పిల్లలు లేరు. దీంతో రమాప్రభ ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. పేరు విజయ చాముండేశ్వరి. ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ భార్య ఈమె.
సినిమా రంగంలో శరత్ బాబు హీరోగా సక్సెస్ కాలేకపోయినా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించారు. 300కు పైగా సినిమాల్లో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, తండ్రిగా, తమ్ముడిగా, అన్నగా.. ఇలాంటి పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించారు. హీరోగా రాణించాలనే తన కోరిక మాత్రం తీరలేదు. అయినా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.