- ఢిల్లీలోని ఈ సెగ్మెంట్లో మనోళ్లే కీలకం
- 2013 ఎన్నికల్లో స్పష్టంగా కన్పించిన తెలుగు ఓటర్ల ప్రభావం
- తెలుగు లీడర్లతో ప్రచారం చేయిస్తున్న పార్టీలు
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలోని సుల్తాన్ పురి మాజ్రా తెలుగువాళ్లకు పెట్టింది పేరు. ఈ ఏరియాలోకి అడుగుపెడితే తెలంగాణ సంస్కృతి ఉట్టిపడుతుంది. వాకిట్లో ముగ్గులు, తెలుగు సంప్రదాయాలతో పల్లె వాతావరణం కనిపిస్తుంది. 1980లో మెదక్ ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టిన ఇందిరాగాంధీ.. తెలుగు ప్రజల కోసం దేశ రాజధానిలో ఈ కాలనీ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో తెలంగాణలోని మెదక్ నియోజకవర్గానికి చెందినవారు అధిక సంఖ్యలో ఉన్నారు. వీరితో పాటూ ఏపీలోని శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఇతర ప్రాంతాల ప్రజలూ ఉన్నారు. 600 కుటుంబాలు, 3 వేలకు పైగా ఓట్లతో ఈ నియోజకవర్గం అభ్యర్థి గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. కేవలం వెయ్యి ఓట్ల తేడాతో సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి జై కిషన్ విజయం సాధించారు. అందుకే అన్ని పార్టీలు తెలుగు కాలనీల్లో ప్రత్యేకంగా ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా… తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇక్కడ ప్రచారం చేస్తారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితులు…
సుల్తాన్ పురి మాజ్రా ఎస్సీ రిజర్వ్ స్థానం. 1993 లో ఈ నియోజక వర్గానికి తొలిసారి ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఈ ప్రాంతం కాంగ్రెస్ కు కంచుకోట. అప్పట్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోరు ఉండేది. 2015 లో ఆమ్ ఆద్మీ పార్టీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో త్రిముఖ పోరు చాలా స్పష్టంగా కన్పిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం, ఆప్ నుంచి గెలిచిన సందీప్ కుమార్ ను ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ సస్పెండ్ చేయడమే. 2015 లో భారీ మెజార్టీ తో గెలిచిన సందీప్ కుమార్, ఢిల్లీ కేబినెట్ లో యంగెస్ట్ మినిస్టర్ గా పని చేశారు. ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేసిన సందీప్ సెక్స్ టేప్ కేసులో తన పదవిని పోగొట్టుకున్నారు. అయితే, ఈ స్థానం నుంచి ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ ముఖేశ్ కుమార్ అహ్లవత్ ని రంగంలోకి దింపింది. బీజేపీ అభ్యర్థిగా రామచంద్ర చడియా పోటీ లో ఉన్నారు. ఇక కాంగ్రెస్ ఈ నియోజక వర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జై కిషన్ ను రంగంలోకి దింపే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే, ఆప్ సామాన్య కార్యకర్తగా, మాజీ మంత్రి గా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సందీప్ ప్రభావం ఈ ఎన్నికల్లో పనిచేయనుంది. ఆయన ఎవరికి మద్దతు తెలిపితే వారినే విజయం వరించే అవకాశాలు ఉన్నాయి. తెలుగు కాలనీ, ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా మారింది.
తెలుగు వారి డిమాండ్లు…
అభివృద్ధి, ఉద్యోగాల విషయంలో చాలా దూరంలో ఉన్నామని సుల్తాన్ పురిలోని తెలుగు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తమకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని.. ఇళ్లు కట్టుకునేందుకు ఏ ప్రభుత్వాలు తమకు సాయం చేయట్లేదని మండిపడుతున్నారు. ఎన్నికల సందర్భంలో కనిపించడమే తప్ప, ఆ తర్వాత మంచి, చెడులు చూసే వారే లేరని వాపోతున్నారు. ఇందిరా గాంధీ చేసిన సహకారానికి అనేక మార్లు హస్తానికి ఓటేసినా… కాంగ్రెస్ నేతలు చేసింది ఏమి లేదంటున్నారు. ఆప్ నేత ను గెలిపించినా, తమ వర్గం వారికి మాత్రమే మేలు చేశారని.. ఇప్పటికీ తమ ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం బాగుపడలేదని చెబుతున్నారు. ఢిల్లీ సర్కార్ అందించే పెన్షన్ తమ కాలనీ వాసులకు అందడం లేదన్నారు. ఎవరు గెలిచినా… ఉత్తారది, దక్షిణాది అన్న భేదం చూపిస్తున్నారని, ఈ సారి తెలుగు వారి ఓట్ల శక్తి ఎంటో చూపిస్తామని సుల్తాన్ పురి వాసులు అంటున్నారు. ఆలయ అభివృద్ధి, కాలనీ వాసుల సంక్షేమం కోసం పని చేసే వారినే ఎన్నుకుంటామని చెప్పారు.