పబ్లిసిటీ కోసం రోడ్డుపై డబ్బులు పడేశాడు.. మనీ హంట్ ఛాలెంజ్ అంటూ ఔటర్ రింగ్ రోడ్ పై డబ్బులు వెదజల్లుతూ వీడియో షూట్ చేశాడు. దీంతో ఫుల్లుగా వ్యూస్ వచ్చి ఫేమస్ అయిపోతా అనుకున్నాడు. కానీ.. ఈ రకంగా ఫేమస్ అవుతానని కళ్లో కూడా ఊహించి ఉండడు.
వివరాల్లోకి వెళ్తే.. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగు రోడ్డు పై మనీ హంట్ ఛాలెంజ్ పేరుతో డబ్బులు వెదజల్లుతూ మంగళ వారం ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశాడు భానుచందర్ అనే యూట్యూబర్. దీనివల్ల పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ అవుతుందని ఘట్ కేసర్ పోలీసులు అతనిపై కేసు రిజిస్టర్ చేశారు. బుధవారం భానుచందర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
అరెస్టు అనంతరం మల్కాజిగిరి ఏసీపి చక్రపాణి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. హైదరాబాద్ బాలానగర్ కు చెందిన రాయలాపురం భానుచందర్ అనే వ్యక్తి మనీహంట్ ఛాలెంజ్ అంటూ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశాడని, ఘట్ కేసర్ వద్ద అవుటర్ రింగురోడ్డుపై చెట్లపొదల్లో డబ్బులు విసిరివేస్తూ.. ఎవరైనా వచ్చి తీసుకోవచ్చని వీడియో రిలీజ్ చేశాడని తెలిపారు.
ఓఆర్ఆర్ సిబ్బంది ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ సెక్షన్ 179, నేషనల్ యాక్ట్ - 1956 ప్రకారం ప్రకారం భానుచందర్ ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపి చక్రపాణి తెలిపారు. ప్రెస్ మీట్ లో ఘట్ కేసర్ సీఐ పి.పరశురాం, ఎస్ఐ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
సరదాగ యూట్యూూబ్ వీడియోలు చేసుకుంటూ ఉండే భానుచందర్.. ఊహించని రీతిలో అరెస్టవ్వడం సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్. డబ్బుల కోసమో.. సరదా కోసమో వీడియోలు చేసుకోవడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వరకు ఓకే. కానీ దానికీ కొంత పరిధి ఉంటుంది. పబ్లిక్ న్యూసెన్స్ చేయనంత వరకు ఓకే.. కానీ శృతి మించితే మాత్రం కటకటాలు తప్పవని ఈ య్యూటూబర్ కేసులో అర్థం చేసుకోవాలి. అందుకే మీలో ఎవరైనా యూట్యూబర్ ఉంటే గుర్తు పెట్టుకోండి. ఇలాంటి పని చేసే ముందు కాస్త జాగ్రత్త.. అతి చేస్తే ఇలాంటి పరిస్థితి తప్పదు. బీ కేర్ఫుల్.