హల్దీరామ్‌‌‌‌లో టెమాసెక్‌‌‌‌కు 10 శాతం వాటా

హల్దీరామ్‌‌‌‌లో టెమాసెక్‌‌‌‌కు 10 శాతం వాటా
  • డీల్‌‌‌‌ విలువ రూ.8,700 కోట్లు

న్యూఢిల్లీ: సింగపూర్‌‌‌‌కు చెందిన‌‌‌‌ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ కంపెనీ  టెమాసెక్‌‌‌‌ స్నాక్స్ తయారు చేసే హల్దీరామ్‌‌‌‌లో 10 శాతం వాటాను దక్కించుకుంది.  ఇందుకోసం సుమారు రూ.8,700 కోట్లను  ఇన్వెస్ట్ చేసింది. ఇండియాలో అతిపెద్ద  స్నాక్స్‌‌‌‌, స్వీట్స్‌‌‌‌ తయారీ కంపెనీగా హల్దీరామ్  కొనసాగుతోంది. 10 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ (రూ.87 వేల కోట్ల) దగ్గర  ఈ డీల్ కుదిరిందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.  ఈ వారం ప్రారంభంలో  డెఫినిటివ్‌‌‌‌ అగ్రిమెంట్‌‌‌‌ను ఇరు కంపెనీలు  కుదుర్చుకున్నాయని తెలిపారు.

ఇండియన్ ప్యాకేజ్డ్‌‌‌‌ ఫుడ్స్‌‌‌‌లో అతిపెద్ద డీల్‌‌‌‌గా ఇది నిలవనుంది.   మరికొంత మంది ఇన్వెస్టర్లను ఆకర్షించాలని  కంపెనీ చూస్తోంది. తాజాగా సేకరించిన ఫండ్స్‌‌‌‌తో బిజినెస్‌‌‌‌ను మరింతగా విస్తరించడానికి వీలుంటుంది.  ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు బ్లాక్‌‌‌‌స్టోన్‌‌‌‌, ఆల్ఫా వేవ్‌‌‌‌ గ్లోబల్‌‌‌‌, బెయిన్‌‌‌‌ క్యాపిటల్‌‌‌‌తో కూడిన కన్సార్టియం హల్దీరామ్‌‌‌‌లో  వాటాలను కొనేందుకు గత కొన్ని నెలలుగా చర్చలు జరిపింది. చివరికి టెమాసెక్‌‌‌‌ వాటాలను దక్కించుకుంది. ప్రమోటర్ అగర్వాల్ ఫ్యామిలీ ఈ స్నాక్స్‌‌‌‌ కంపెనీని వచ్చే ఏడాది ఐపీఓకి  తీసుకురావాలని కూడా ప్లాన్ చేస్తోంది. హల్దీరామ్‌‌‌‌కు 2023–24 లో రూ.12 వేల కోట్ల రెవెన్యూ వచ్చింది. ఈ కంపెనీ రెస్టారెంట్లను కూడా ఆపరేట్ చేస్తోంది.