తెలంగాణలో 42 డిగ్రీలు దాటిన ఎండ.. దడ పుట్టిస్తున్న వడగాడ్పులు

తెలంగాణలో 42 డిగ్రీలు దాటిన ఎండ.. దడ పుట్టిస్తున్న వడగాడ్పులు
  • ఆసిఫాబాద్​లో అత్యధికంగా 42.4 డిగ్రీల టెంపరేచర్​
  • మరో 9 జిల్లాల్లో 41 డిగ్రీల కన్నా ఎక్కువే
  • ఈ నెల 21, 22 తేదీల్లో  తేలికపాటి వర్షాలకు చాన్స్​

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో వడగాడ్పులు మొదలయ్యాయి. ఉదయం పదకొండు దాటిందంటే చాలు.. ఎండ మంటలు రాజేస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో ఆదివారం వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం కూడా వడగాడ్పుల ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత మరింత పెరిగింది. టెంపరేచర్లు 42 డిగ్రీల మార్క్​ను దాటేశాయి. 22 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. అందులో 9 జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా రికార్డ్​ అయిన జిల్లాలున్నాయి. 

ఆసిఫాబాద్​లో అత్యధికం

అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా ఆసిఫాబాద్​లో 42.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్​ జిల్లా నేరడిగొండ, మంచిర్యాల జిల్లా అందుగులపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిల్లో 41.5 డిగ్రీల టెంపరేచర్​ రికార్డయింది. వనపర్తి జిల్లా వెల్గొండలో 41.3, నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లిలో 41.2, జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో 41.1, సిద్దిపేట జిల్లా బెజ్జంకి, మెదక్​ జిల్లా దామరంచ, నిజామాబాద్​జిల్లా కేంద్రంలో 41 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

జయశంకర్​ భూపాలపల్లి, పెద్దపల్లి, భద్రాద్రి, కామారెడ్డి, నిర్మల్​, రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్​నగర్​, వికారాబాద్​, కరీంనగర్​, జోగుళాంబ గద్వాల, ములుగు జిల్లాల్లో 40.2 నుంచి 40.8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డ్​ అయ్యాయి. మిగతా జిల్లాల్లో 38.4 డిగ్రీల నుంచి 39.8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా వరంగల్​ జిల్లా దుగ్గొండిలో 38.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. హైదరాబాద్​ సిటీలో 39.6 డిగ్రీల మేర ఎండ వేడి రికార్డయింది. కాగా, నిరుడు ఇదే సమయంలో రాష్ట్రంలో హయ్యెస్ట్​ టెంపరేచర్​ 40.9 డిగ్రీలు.. నిర్మల్​ జిల్లాలో నమోదైంది. 

21, 22న తేలికపాటి వర్షాలు

ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం ఉండగా.. సోమవారం కూడా ఆ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్​, కుమ్రంభీం ఆసిఫాబాద్​, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది. 

అయితే, రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పులేమీ ఉండబోవని, ఆ తర్వాత మాత్రం కాస్తంత తగ్గే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 21, 22వ తేదీల్లో పలు చోట్ల  తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు చాన్స్​ ఉందని వెల్లడించింది. హైదరాబాద్​లో ఉష్ణోగ్రతలు 38 నుంచి 39 డిగ్రీల మధ్యనే రికార్డ్​ అవుతాయని, వాతావరణం మబ్బు పట్టి ఉంటుందని పేర్కొంది.