తెలంగాణలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణలో   క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
  • 7 జిల్లాల్లో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు
  • సాధారణం కన్నా రెండు మూడు డిగ్రీలు ఎక్కువ 
  • హైదరాబాద్​లో పొద్దున ఎండ.. సాయంత్రం వాన 
  • నేడు పలు జిల్లాలకు  ఎల్లో అలర్ట్ జారీ  

హైదరాబాద్, వెలుగు: ఇన్నాళ్లూ వరుణుడు జోరు చూపిస్తే.. ఇప్పుడు సూరీడు మంటెక్కిస్తున్నాడు. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణం కన్నా రెండు మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. టెంపరేచర్లు 7 జిల్లాల్లో 40 డిగ్రీల మార్క్​ను చేరుకున్నాయి. మంగళవారం అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో 39.8 డిగ్రీలు, పెద్దపల్లిలో 39.7, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 39.4, హనుమకొండలో 39.3, రంగారెడ్డిలో 39.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి.  మిగతా జిల్లాల్లో 37 నుంచి 38 డిగ్రీల మేర టెంపరేచర్లు  నమోదయ్యాయి. 

ఇయ్యాల పలు జిల్లాల్లో వానలు 

రాష్ట్రంలో మంగళవారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. కామారెడ్డి, నిర్మల్, సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్​లలో మోస్తరు వానలు కురిశాయి. కామారెడ్డి జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. గాంధారిలో అత్యధికంగా 9.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా వానలపహాడ్​లో 4.9, సిద్దిపేట జిల్లా ముస్త్యాలలో 3.7, జగిత్యాల జిల్లా కథలాపూర్​లో 3.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

హైదరాబాద్ సిటీలో పొద్దునంతా ఎండ కొట్టగా సాయంత్రం కాగానే మబ్బులు పట్టి మోస్తరు వర్షాలు పడ్డాయి. కుత్బుల్లాపూర్​లో అత్యధికంగా 5.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కూకట్​పల్లిలో 5.1, సికింద్రాబాద్​లో 4.7, ముషీరాబాద్​లో 4.1, గోల్కొండలో 3.8, అల్వాల్​లో 3.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బుధవారం కూడా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. హైదరాబాద్​లో సాయంత్రం మబ్బు పట్టి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.