- 17 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు
- మంచిర్యాల, సూర్యాపేట, జగిత్యాల, భద్రాద్రి, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లో 41
- వచ్చే నాలుగు రోజులు మోస్తరు వర్షాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వర్షాలు పడకపోతుండడంతో టెంపరేచర్లు పెరుగుతున్నాయి. ఉత్తరాది జిల్లాలతో పాటు దక్షిణాది జిల్లాల్లోనూ 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే మోస్తరు వర్షాలు పడ్డాయి. బుధవారం 17 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా భీమారంలో అత్యధికంగా 41.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. సూర్యాపేట జిల్లాలో 41.2, జగిత్యాల జిల్లాలో 41.1, భద్రాద్రి కొత్తగూడెంలో 41.1, ములుగులో 41.1, పెద్దపల్లిలో 41, నల్గొండలో 40.9, కరీంనగర్ లో 40.8, మహబూబాబాద్‌లో 40.8, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 40.7, వరంగల్‌లో 40.6,
యాదాద్రి భువనగరిలో 40.6, ఖమ్మంలో 40.5, జయశంకర్ భూపాలపల్లిలో 40.3, నిర్మల్‌లో 40.2, నిజామాబాద్‌లో 40, జనగామలో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మిగతా జిల్లాల్లో 36 నుంచి 39 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. కాగా, ఖమ్మం జిల్లా వేంసూరులో 5.6 సెంటీమీటర్ల వర్షం పడింది. జగిత్యాల జిల్లా మేడిపల్లిలో 3, నిజామాబాద్ జిల్లా సాలూరలో 2.6, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో 2, సూర్యాపేట జిల్లా మునగాలలో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అయితే, రాబోయే నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం 12 జిల్లాలు, శుక్రవారం 14, శనివారం 5, ఆదివారం 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో వర్షం పడుతుందని పేర్కొంది.