దంచికొడుతున్న ఎండలు .. ఎండిపోయిన చెరువులు

దంచికొడుతున్న ఎండలు .. ఎండిపోయిన చెరువులు
  • పలు ప్రాంతాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
  • తాగునీటి కోసం మూగజీవాల తండ్లాట

నాగర్​కర్నూల్, వెలుగు: గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. కేఎల్ఐ పథకంలోని ప్రధాన రిజర్వాయర్లు దాదాపుగా అడుగంటిపోయాయి. పశువులు నీళ్లు తాగేందుకు కూడా అవకాశం లేకుండా నోటిఫైడ్​ చెరువులు, కుంటలు ఎండిపోయి బీటలు  వారాయి. కొన్నిప్రాంతాల్లో పంటలు, తోటలు ఎండిపోయినా, రైతులు మూగజీవాల గొంతు తడిపేందుకు బోర్ల ద్వారా గుంతల్లో నీళ్లు నింపుతున్నారు. పట్టణ ప్రాంతాల్లోని పశువులు, మేకలు, ఇతర జంతువుల దాహార్తి తీర్చడం రైతులకు భారంగా మారుతోంది. గత ప్రభుత్వం నిర్వాకంతో జిల్లాలోని కేఎల్ఐ పథకం కింద 600 చెరువులు మైదానాలను తలపిస్తున్నాయి.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..

బుధవారం జిల్లాలోని కిష్టంపల్లి, వెల్దండ, బిజినేపల్లి, కల్వకుర్తి ప్రాంతాల్లో 44.1 నుంచి 44.8 డిగ్రీల వరకు టెంపరేచర్​ నమోదైంది. మరో ఐదు ప్రాంతాల్లో 43 డిగ్రీల నుంచి 43.7 డిగ్రీలు నమోదయ్యాయి.14 ప్రాంతాల్లో 41 నుంచి 42 డిగ్రీలు నమోదయ్యాయి. నల్లమల ప్రాంతంలోని వటవర్లపల్లిలో కనిష్టంగా 39.1 డిగ్రీలు నమోదైంది. నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్, పదర, అచ్చంపేట, కొల్లాపూర్, లింగాల, బల్మూరు మండలాల్లో ఎండల తీవ్రత తక్కువగా ఉండేది. ఈసారి అక్కడ కూడా40 డిగ్రీల ఊష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  వడదెబ్బ సోకిన వారి కోసం జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ఏరియా హాస్పిటల్స్​లో కూడా వడదెబ్బ నివారణకు అత్యవసర మందులు, సెలైన్లు అందుబాటులో ఉంచారు.

మైదానాన్ని తలపిస్తున్న కృష్ణానది.. 

 కృష్ణా నదిలో పడవల ద్వారా ప్రయాణం చేసిన మంచాలకట్ట తదితర ప్రాంతంలో నీళ్లు కనిపించడం లేదు. నది మధ్యలో రోడ్డు తయారైంది. ఏపీలోని నెహ్రూనగర్​ వరకు బైకులు, జీపులు నడుస్తున్నాయంటే  పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సమైక్య రాష్ట్రంలో టీడీపీ హయాంలో పశువుల దాహార్తి తీర్చేందుకు నిర్మించిన నీటి సంపులు ఇప్పుడు ఉపయోగంలోకి వస్తున్నాయి. 

నల్లమల అటవీ ప్రాంతం, ఓపెన్​ ఫారెస్ట్​ ప్రాంతాలైన చారకొండ, వెల్దండ, ఆమనగల్లు, బిజినేపల్లి, పెద్దకొత్తపల్లి తదితర ప్రాంతాల్లో తాగునీటి కోసం వన్యప్రాణులు తండాలు, గ్రామాల్లోకి వస్తున్నాయి. మధ్యాహ్నం 12 దాటితే జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎంపీ ఎలక్షన్ల ప్రచారంలో ప్రధాన పార్టీల క్యాండిడేట్లు మాత్రమే ఎండల్లో తిరుగుతున్నారు.