- ఆదిలాబాద్ అర్లిటిలో 5, అటవీ సమీపప్రాంతాల్లో 2 డిగ్రీల టెంపరేచర్
వెలుగు: రాష్ట్రంలో రెండ్రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో సోమ, మంగళవారం చలి గాలులు వీస్తాయని వెల్లడించింది. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 5 డిగ్రీలుగా నమోదైంది. సంగారెడ్డి , ఆసిఫాబాద్, తదితర జిల్లాల్లో చలి ఎక్కువగాఉన్నట్టు తెలిపింది.
గడ్డకడుతున్న ఆదిలాబాద్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టెంపరేచర్లు బాగా పడిపోయాయి. పట్టణాల్లో ఏడు డిగ్రీల కన్నా పెరగడంలేదు. అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉండే గ్రామాల్లో టెంపరేచర్ 2, 3 డిగ్రీలకంటే తక్కువకు పడిపోతోంది. మరో ఐదు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని ఇండియన్ మెట్రొలాజికల్ డిపార్ట్మెంట్ అధికారులు హెచ్చరించడంతో ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. స్కూళ్ల టైమింగ్ మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఆదివారం అర్లి.టి 5,తాంసి 6.2, సిర్పూర్ యు 6.6, బరంపూర్ 7, ఆదిలాబాద్ కలెక్టరేట్ 7 .3, తలమడుగులో టెంపరేచర్ 7.9 డిగ్రీలు నమోదైనట్లు తెలిపింది. రాత్రుళ్లు చలి తీవ్రంగా ఉంటోందని, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కోళ్లు, మేకలు చనిపోతున్నాయని ఫారాల రైతులు చెబుతున్నారు.