హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టెంపరేచర్లు భారీగా తగ్గాయి. మంగళవారం ఒకట్రెండు జిల్లాల్లో మినహా సాధారణం కన్నా తక్కువగా టెంపరేచర్లు నమోదయ్యాయి. 22 జిల్లాల్లో 35 డిగ్రీల కన్నా తక్కువగా, మిగతా 11 జిల్లాల్లో 35 నుంచి 38 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. అత్యధికంగా ములుగు జిల్లా మంగపేటలో 38.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా.. అత్యల్పంగా మేడ్చల్ జిల్లా ఉప్పల్‌లో 32.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. మెదక్, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లోనూ 32 డిగ్రీల మేరనే ఉష్ణోగ్రతలు రికార్డుకాగా.. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, జనగామ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, హనుమకొండ, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో 33 నుంచి 34 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. మహబూబాబాద్, నల్గొండ, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో 34 నుంచి 34.9 మధ్య నమోదయ్యాయి.
ఉత్తరాది జిల్లాల్లో వర్షాలు
మంగళవారం ఉత్తరాది జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. అత్యధికంగా కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో 3.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిజామాబాద్జిల్లా మోర్తాడ్‌లో 3.1, ఆదిలాబాద్‌లో 3, జగిత్యాల జిల్లా పెగడపల్లిలో 2.9, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 2.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణం మబ్బులు పట్టి ఉంటుందని పేర్కొంది.