ఎండలతో ఉక్కిరిబిక్కిరి :  ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలు

ఎండలతో ఉక్కిరిబిక్కిరి :  ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలు
  • వారం రోజులుగా 35 డిగ్రీలు నమోదు 
  • పత్తి కూలీలపై పడనున్న ప్రభావం
  • ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదు

ఆదిలాబాద్, వెలుగు: ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వారం, పది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఉత్తర కార్తె ఎండల ప్రభావం ఆదిలాబాద్ ​జిల్లాలోని ప్రజలు, కూలీలపై తీవ్రంగానే కనిపిస్తోంది. సెప్టెంబర్ 30తో వర్షాకాలం సీజన్ ముగియడంతో నైరుతి రుతుపవనాలు వెనక్కి వెళ్లిపోయాయి. ఫలితంగా వాతావరణం చల్లబడాలి కానీ ఎండలు మండిపోతున్నాయి. వాతావరణ మార్పులతో జిల్లా వ్యాప్తంగా నిత్యం ఉక్కపోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పత్తి ఏరడం ప్రారంభమవడంతో కూలీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఉదయం నుంచే..

సాధారణంగా వానాకాలం ముగిసిన తర్వాత అక్టో బర్​లో వాతావరణం చల్లబడుతుంది. అయితే ఉత్తర కార్తె కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ఎండాకాలం తరహాలో ఎండలు దంచికొడుతున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ ​జిల్లాలో వారం, పది రోజులుగా ఉదయం 8 నుంచే ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల నుంచి 35 వరకు నమోదవుతున్నాయి. దీంతో రాత్రి సమయంలో ప్రజలు మూలకున్న కూలర్లను మళ్లీ బయటకు తీస్తున్నారు. మరో 15 రోజుల పాటు ఉత్తర ఎండల బాధలు తప్పేలా లేవు. 

సాధారణ వర్షపాతమే..

ఈ ఏడాది జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి మొదలైన వానాకాలం సీజన్ సెప్టెంబర్ 30న ముగిసింది. జూన్ నాలుగో వారం వరకు వర్షాలు అంతంతమాత్రంగానే కురిశాయి. జూలైలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసినప్పటికీ ఆగస్టులో మరోసారి ముఖం చాటేశాయి. దీంతో ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలు అధికమయ్యాయి. ఈ ఆగస్టు నెల మొత్తం ఎండకాలాన్నే తలపించింది. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలో వర్షాలు దంచికొట్టడంతో ప్రజలు, ఇటు రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా జైనథ్, బేల, తాంసి, ఉట్నూర్, భీంపూర్ మండలాల్లో పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఆ తర్వాత తేలికపాటి వర్షాలు, నెలాఖరులో అక్కడక్కడా భారీ వర్షాలు కురవడంతో వానాకాలం సీజన్ సాధారణ వర్షపాతంతో ముగిసింది. జిల్లాలో సాధారణ వర్షపాతం 1000 మిల్లీ మీటర్లు కాగా 1072 మి.మీ. వర్షం కురిసింది. 

సీజన్​లో ఉక్కపోతలే..

సాధారణంగా వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. కానీ ఈ ఏడాది సీజన్ అంతా డిఫరెంట్ గా కనిపించింది. చల్లదనం కంటే ఎక్కువగా ఉక్కపోతలే ఉక్కిరిబిక్కిరి చేశాయి. వర్షాలు కురిసినా.. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతూ విభిన్న వాతావరణాన్ని తలపించింది. ఒకరోజు వర్షం కురిస్తే మరో రోజు ఉష్ణోగ్రతలు 30 దాటి ఆశ్చర్యానికి గురిచేశాయి. గాలిలో తేమ శాతం అధికంగా నమోదు కావడంతోనే ఈ పరిస్థితులు ఎదురైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అక్టోబర్ మొదటి వారంలోనే ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో రైతులు, కూలీలు అందోళన వ్యక్తం చేస్తున్నారు.