- మూడు రోజులపాటు 12 జిల్లాలకు రెడ్ అలర్ట్
- 9 జిల్లాల్లో 45కిపైగా.. 7 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత
- మే నెల వాతావరణ పరిస్థితులపై ఐఎండీ స్పెషల్ బులెటిన్
- వడగాలులు తగ్గి.. టెంపరేచర్లు పెరిగే చాన్స్
- వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువగా ఉంటుందని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. రాత్రి తొమ్మిదైనా వేడి తగ్గడం లేదు. నిత్యం సాధారణం కన్నా ఏడెనిమిది డిగ్రీలు ఎక్కువగా టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయి.
బుధవారం 11 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాబోయే మూడు రోజులకుగానూ 12 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. టెంపరేచర్లు 46 డిగ్రీలకుపైగా నమోదయ్యే ముప్పుందని పేర్కొంది. భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని వెల్లడించింది. అలాగే, వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. వడగాలులకు ఆరెంజ్ అలర్ట్‌ను ఇష్యూ చేసింది. ఈ మేరకు మే నెల వాతావరణ పరిస్థితులపై ఐఎండీ స్పెషల్ బులెటిన్‌ను విడుదల చేసింది.
ఈ జిల్లాలన్నీ రెడ్ జోన్లు..
ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్నగర్ఉమ్మడి జిల్లాల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లోని అన్ని మండలాలూ రెడ్ అలర్ట్ జోన్లోకి వెళ్లిపోయాయి. అక్కడ 45 డిగ్రీల నుంచి 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి. బుధవారం అత్యధికంగా నల్గొండ జిల్లా గుడాపూర్‌లో 46.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. మంగపేట (ములుగు), మునగాల (సూర్యాపేట), చండూరు (నల్గొండ), భద్రాచలం (భద్రాద్రి కొత్తగూడెం)లో 46.5, తిమ్మాపూర్ (నల్గొండ), వైరా (ఖమ్మం), ఖానాపూర్ (ఖమ్మం), వెల్గటూర్(జగిత్యాల), ముత్తారం (పెద్దపల్లి)లో 46.4, కొమ్ములవంచ (మహబూబాబాద్)లో 46.3, కల్లెడ (వరంగల్), వీణవంక (కరీంనగర్), జన్నారం (మంచిర్యాల)లో 46.2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 9 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా, 7 జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా, 6 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డ్అయ్యాయి.
ఓ వైపు ఎండలు.. మరో వైపు వానలు
ఈ నెలలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఐఎండీ స్పెషల్ బులెటిన్ లో వెల్లడించింది. అయితే, వడగాలుల వీచే రోజుల సంఖ్య మాత్రం తగ్గుతుందని తెలిపింది. రాష్ట్రంలో మే నెల మొత్తంగా సగటున నాలుగు రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, ఇటు వానలు కూడా పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. 1970 నుంచి 2020 వరకు మేలో నమోదైన సగటు వర్షపాతం (64.1 మిల్లీమీటర్లు) ఆధారంగా.. ఈ నెలలోనూ సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
91 నుంచి 109 శాతం వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయని తెలిపింది. పసిఫిక్‌లో ఎల్‌నినో పరిస్థితులు తగ్గుముఖం పడుతున్నాయని, వానాకాలం ప్రారంభం నాటికి వర్షాలు సమృద్ధిగా కురిసే పరిస్థితులు వస్తాయని పేర్కొంది. హిందూ మహాసముద్రంలోనూ ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐవోడీ) పాజిటివ్‌గా ఉండడంతో ఈ వర్షాకాలంలో వానలు ఎక్కువగా పడే అవకాశం ఉందని తెలిపింది.
పిల్లలు, వృద్ధులు జాగ్రత్త: రవీందర్‌నాయక్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్
పిల్లలు, వృద్ధులపై వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉండే చాన్స్ ఉంది. వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎండపూట బయటకు వెళ్లనివ్వొద్దు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అర్జెంట్ పనులుంటే తప్ప బయటకు రాకూడదు. అత్యవసరమనుకుంటేనే రావాలి. ఒకవేళ బయటకు వెళ్లాలనుకుంటే ఒంటికి సన్‌స్క్రీన్ లోషన్‌ను రాసుకోవాలి. నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు, చలువనిచ్చే పుచ్చకాయ, కర్బూజ వంటి పండ్లు, కీరా ఎక్కువగా తీసుకోవాలి. పలుచని కాటన్ బట్టలు వేసుకోవాలి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉంటే బెటర్. ముందస్తు జాగ్రత్తగా అన్ని ఆస్పత్రుల్లోనూ ప్రత్యేక బెడ్లు, ఐవీ ఫ్లుయిడ్లు, అవసరమైన మందులను ఏర్పాటు చేశాం. ఏఎన్ఎంలు, ఆశాలు, అంగన్వాడీ వర్కర్ల దగ్గర అదనపు ఓఆర్ఎస్ప్యాకెట్లను అందుబాటులో ఉంచాం.