ఈ వారం గజగజ: టెంపరేచర్లు 3 నుంచి 5 డిగ్రీల దాకా పడిపోయే అవకాశం

  • ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో రాబోయే వారం రోజుల్లో చలి తీవ్రత పెరగనుందని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. రాబోయే నాలుగు రోజుల పాటు ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​ను జారీ చేయగా.. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్​ను ఇచ్చింది. 

మిగతా జిల్లాల్లో సాధారణం కన్నా కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్​ సిటీలో రెండు రోజులు మబ్బు పట్టి ఉంటుందని, ఉదయం వేళల్లో పొగమంచు కురుస్తుందని తెలిపింది.

టెంపరేచర్లు తక్కువగా రికార్డయ్యే జిల్లాల్లో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. చలి నుంచి రక్షించుకునే దుస్తులు వేసుకోవాలని చెబుతున్నారు. మరోవైపు మంగళవారం రాత్రి ఆదిలాబాద్​లో అత్యల్పంగా 8.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. నిరుడు ఇదే రోజు 11.2 డిగ్రీల టెంపరేచర్​ నమోదవగా.. ఇప్పుడు చలి ఎక్కువగా ఉన్నది.

ALSO READ : తెలుగు మీడియం కనుమరుగు .. ప్రైవేట్​, ఎయిడెడ్​ స్కూళ్లలో అంతా ఆంగ్లమయమే

ఆసిఫాబాద్​ జిల్లాలో 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే రోజు అక్కడ 10.5 డిగ్రీల టెంపరేచర్​ నమోదైంది. నిర్మల్​ జిల్లాలో 11.5, జగిత్యాల జిల్లాలో 12.3, సంగారెడ్డిలో 13, పెద్దపల్లిలో 13.1, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో 13.2, కామారెడ్డిలో 13.3, భూపాలపల్లిలో 13.4 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదయ్యాయి. హైదరాబాద్​లో అత్యల్పంగా మౌలాలిలో 14.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.