
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ లో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 39.2 డిగ్రీలు నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ఎండాకాలం మొదలైనప్పటి నుంచి నగరంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని చెప్పింది. 20వ తేదీలోపు 40 డిగ్రీల కంటే తక్కువగానే టెంపరేచర్నమోదవుతుందని, అప్పటివరకు వడగాల్పులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
20 నుంచి 24వ తేదీ వరకు గ్రేటర్ లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మార్చి 25 వ తేదీ నుంచి వడగాల్పులు మళ్లీ ప్రారంభమవుతాయన్నారు. ఆదివారం ఎండ దంచి కొట్టడంతో జనం ఇండ్లకే పరిమితం అయ్యారు. మధ్యాహ్నం తర్వాత రోడ్లు బోసిపోయి కనిపించాయి. నిత్యం వాహనాలు, సందర్శకులతో రద్దీగా ఉండే ట్యాంక్బండ్పరిసరాలు, ఇతర ప్రాంతాలు ఖాళీగా దర్శనమిచ్చాయి. సాయంత్రం 6 గంటలు వరకు రోడ్ల మీద పెద్దగా రద్దీ లేదు.