![ఫిబ్రవరిలోనే మంటలు .. 22 జిల్లాల్లో 37 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు](https://static.v6velugu.com/uploads/2025/02/temperatures-rise-in-telangana-weeks-ahead-of-summer_W6fKnCji8T.jpg)
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. పలు చోట్ల సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా రికార్డవుతున్నాయి. దాంతో పాటు ఉక్కపోత తీవ్రత కూడా క్రమంగా పెరుగుతున్నది. 22 జిల్లాల్లో వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల కన్నా ఎక్కువగా రికార్డ్ అవుతున్నాయి. మిగతా జిల్లాల్లోనూ 36కు పైగానే నమోదవుతున్నాయి.చలిగాలులను తీసుకొచ్చే వెస్టర్లీస్ నిష్క్రమించడం.. బంగాళాఖాతం మీదుగా తూర్పు, ఆగ్నేయం నుంచి గాలులు వీస్తుండడంతో వాతావరణం వేడెక్కుతున్నదని అధికారులు చెప్తున్నారు.
మార్చిఫస్ట్ వీక్ వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు వాతావరణం స్టెబిలైజ్ అవుతుందని, కొన్నాళ్లకు ఉష్ణోగ్రతల్లో పెరుగుతుందన్నారు. మేలో ఈసారి రికార్డ్ స్థాయిలో టెంపరేచర్లు ఉంటాయన్నారు. మంగళవారం ఆదిలాబాద్లో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జోగుళాంబ గద్వాల, కామారెడ్డి, మంచిర్యాల, ములుగు, నిర్మల్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్కర్నూల్, నిజామాబాద్, వనపర్తి, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్నగర్, సంగారెడ్డి జిల్లాల్లో 37 డిగ్రీలకన్నా ఎక్కువగా రికార్డయ్యాయి.
రాత్రి ఉష్ణోగ్రతలు జంప్..
రాష్ట్రంలో ఇక చలికాలం అయిపోయినట్టేనని అధికారులు అంటున్నారు. ఒక్క రంగారెడ్డి జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా 15 డిగ్రీలకుపైగానే రాత్రి టెంపరేచర్లు రికార్డవుతున్నాయి. హనుమకొండ, హైదరాబాద్, రామగుండం, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సోమవారం రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలకు మించి నమోదయ్యాయి. అత్యధికంగా భద్రాచలంలో 21.8 డిగ్రీల మేర రాత్రి టెంపరేచర్ రికార్డయింది.
నిజామాబాద్లో 21.3, హైదరాబాద్, మహబూబ్నగర్లో 21.1, ఖమ్మంలో 21, రామగుండంలో 20.5, హయత్నగర్, హకీంపేట, హనుమకొండలో 20 డిగ్రీల చొప్పున రాత్రి టెంపరేచర్లు రికార్డయ్యాయి. అత్యల్పంగా రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 14.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.