
ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. సమ్మర్ స్టార్టింగ్లోనే ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. వేసవి ఆరంభంలోనే 45 నుంచి 50 డిగ్రీల టెంపరేచర్ నమోదు అవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడు భగభగ మండిపోవడంతో ప్రజలు వేడికి అల్లాడిపోతున్నారు. భానుడి ప్రతాపానికి అతలాకుతలం అవుతోన్న ప్రజలకు వాతావరణ నిపుణులు చల్లటి కబురు చెప్పారు. రాబోయే 48 గంటలు తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతాయని తెలిపారు.
ముఖ్యంగా రాత్రి సమయంలో టెంపరేచర్ తక్కువ స్థాయిలో నమోదు అవుతుందన్నారు. తద్వారా రాత్రి ఉక్కుపోత నుంచి ప్రజలు కాస్తా ఉపశమనం పొందుతారు. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల్లో 2025, మార్చి 5వ తేదీ రాత్రి నుంచి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని వెల్లడించారు. ఉదయం, రాత్రి వేళల్లో వాతావరణం చల్లగా ఉంటుందని అంచనా వేశారు.
భానుడి భగభగలతో ఉడికిపోతున్న రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వాసులకు కూడా కూల్ న్యూస్ చెప్పారు వెదర్ ఎక్స్ పర్ట్స్. బుధవారం (మార్చి 5) రాత్రి నుంచి హైదరాబాద్‌లో కూడా ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయని.. అయితే, అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం కారణంగా కోర్ సిటీలో చాలా వరకు చల్లగా ఉండకపోవచ్చు అంచనా వేశారు. కానీ ఉదయం పూట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని తెలిపారు.
ALSO READ | ట్రిపుల్ఆర్ సౌత్ డీపీఆర్కు ఏజెన్సీ ఫైనల్
తెల్లవారుజూమున నగర శివార్లలో చాలా చల్లగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే.. ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా తగ్గడానికి కారణం ఉత్తర భారతదేశం నుండి ఆకస్మికంగా వీచే చలి గాలులని తెలిపారు వాతావరణ నిపుణులు. మార్చి 6, 7 తేదీల్లో ఉదయం ఉష్ణోగ్రతలు 10 నుంచి 12 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని.. అదే మధ్యాహ్నం 35-36 డిగ్రీల సెల్సియస్ల ఉష్ణోగ్రత ఉంటుందని తెలిపారు. మార్చి 9 తర్వాత మళ్ళీ ఎండలు దంచికొట్టే అవకాశం ఉందని అంచనా వేశారు.