హైదరాబాద్, వెలుగు :రాష్ట్రంలో ఎండలు మళ్లీ పెరుగుతున్నాయి. వర్షాలతో రెండు వారాల పాటు తగ్గుముఖం పట్టిన టెంపరేచర్లు క్రమంగా ఎక్కువవుతున్నాయి. రానున్న వారం రోజుల పాటు ఎండలు మరింత ముదురుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ శుక్రవారం హెచ్చరించింది. సగటున 3 డిగ్రీల వరకు టెంపరేచర్లు పెరుగుతాయని తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలో టెంపరేచర్లు మరోసారి 45 డిగ్రీల మార్క్‌ను దాటాయి. జగిత్యాల జిల్లా నేరెళ్లలో 45.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో 44.9, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 44.4, ఆదిలాబాద్ జిల్లా అర్లిటిలో 44, కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 43.9, నిర్మల్ జిల్లా బుట్టాపూర్‌లో 43.8, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో 43.7, నల్గొండ జిల్లా బుగ్గబావిగూడలో 43.5, నిజామాబాద్ జిల్లా కల్దుర్కిలో 43.5, రాజన్నసిరిసిల్ల జిల్లా మల్లారంలో 43.2, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చిల్కానగర్‌లో 43 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మిగతా చోట్ల 42 డిగ్రీల మేర టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి. రాబోయే వారం రోజుల్లో ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు దక్షిణాదిలోని జనగామ, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో టెంపరేచర్లు తీవ్రమవుతాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో టెంపరేచర్లు 47 డిగ్రీల వరకు వెళ్లొచ్చని చెప్పారు.
నెలాఖరునాటికి కేరళకు నైరుతి..
నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్‌లోని మొత్తం ప్రాంతానికి విస్తరించాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర మధ్య బంగాళాఖాతంలోకి మరింత ముందుకు వచ్చాయని తెలిపింది. ఈ నెలాఖరు నాటికి కేరళను తాకేందుకు అనుకూల వాతావరణం ఉందని వెల్లడించింది. కాగా, రాష్ట్రానికి తుఫాన్ ముప్పు తప్పింది. మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని, అది ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని ఖేర్పుర వద్ద కేంద్రీకృతమైందని వాతావారణ శాఖ తెలిపింది. శనివారం అది తుఫానుగా మారి అదే రోజుల తీవ్ర తుఫానుగా బలపడి ఖేర్పుర వద్దే తీరం దాటొచ్చని తెలిపింది.