ముషీరాబాద్, వెలుగు: ఏపీ నుంచి తెలంగాణ దేవాదాయ శాఖకు రూ. వెయ్యి కోట్లు రావాల్సి ఉందని, సీఎం రేవంత్రెడ్డి వాటిని రప్పించే ప్రయత్నం చేయాలని తెలంగాణ అర్చక, ఉద్యోగ జేఏసీ రాష్ట్ర కార్యవర్గం డిమాండ్ చేసింది. బుధవారం అడిక్మెట్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఉద్యోగుల సంఘం నేత కొండూరి కృష్ణమాచారి అధ్యక్షత వహించారు.
ఆయనతోపాటు జేఏసీ చైర్మన్ ఉపేంద్ర శర్మ, ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండూరి కృష్ణమాచార్యులు, అర్చక కన్వీనర్ పి.రవీంద్ర చారి, కో కన్వీనర్ బద్రీనాథ్ చార్యులు, జాయింట్ సెక్రెటరీ జైపాల్ రెడ్డి, పి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ నెల 6న సమావేశమవుతున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు విభజన చట్టం ప్రకారం తెలంగాణ దేవాదాయ శాఖకు రావాల్సిన బాకాయిలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ధార్మిక పరిషత్తును వెంటనే ఏర్పాటు చేయాలని, పదవి విరమణ పొందిన ప్రతి అర్చకుడికి రూ.10 లక్షల గ్రాట్యుటీ చెల్లించాలని, 10 ఏండ్ల సర్వీస్ పూర్తి చేసిన ప్రతి అర్చకుడికి, ఉద్యోగికి రూ.25 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రతిపాదించిన ప్రకారం 190 ఆలయ ఈఓ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. దేవాదాయ శాఖ పరిధిలో 18 వేల ఆలయాలు, దాదాపు 1.21 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయని చెప్పారు. కొన్నిచోట్ల ఎకరం రూ.100 కోట్లు పలికే భూములు ఉన్నాయని, సరైన పర్యవేక్షణ లేక ఇప్పటికే 30 వేల ఎకరాలు అన్యాక్రాంతం అయ్యాయని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి ఆలయ భూములను కాపాడాలన్నారు.