పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆధీనంలో ఉన్న రంగనాయక స్వామి ఆలయ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని తిరిగి ఆలయానికి అప్పగించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌రావు డిమాండ్ చేశారు. గురువారం ఆయన పెద్దపల్లి మండలం ధర్మాబాద్ గ్రామంలో ఉన్న రంగనాయకస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రదీప్ రావు మాట్లాడారు.
ప్రాచీన చరిత్ర కలిగిన స్వామివారి ఆలయం నిర్లక్ష్యానికి గురవుతోందన్నారు. ఆలయ భూములను స్థానిక ఎమ్మెల్యే దాసరితో పాటు ఆయన అనుచరులు స్వాధీనం చేసుకొని దున్నుకుంటున్నారని ఆరోపించారు. వెంటనే సర్కార్ స్పందించి భూములను ఆలయానికి ఇప్పించాలన్నారు. ఇంత కాలం భూములను దున్నుకున్నందుకు వారి నుంచి కౌలు వసూలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్మాబాద్ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని సూచించారు.
కార్యక్రమంలో శిలారపు పర్వతాలు, దాడి సంతోష్, తంగెడ రాజేశ్వరరావు, మేకల శ్రీనివాస్, రాజం మహంత కృష్ణ, పోల్చాని సంపత్ రావు, బెజ్జంకి దిలీప్ కుమార్, శివంగారి సతీశ్, ఎర్రోళ్ల శ్రీకాంత్, పెంజార్ల రాకేశ్, భూషణ వేణు, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.