దేశంలో ఎన్ని ప్రసిద్ధ శైవక్షేత్రాలు ఉన్నా వేటికవే ప్రత్యేకం. మధ్యప్రదేశ్‌లోని ఓ శివాలయానికి కూడా అలాంటి ఓ ప్రత్యేకతే ఉంది. రాయ్ సేన్ జిల్లాలోని సోమేశ్వరాలయం ఏడాదిలో ఒక్క రోజు అదీ శివరాత్రి పర్వదినాన మాత్రమే తెరుచుకుంటుంది. దశాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. శివరాత్రి రోజు రాత్రి ఎప్పటిలాగే ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఈ ఆలయానికి మరో విశిష్టత ఉంది. అదేంటంటే ఈ గుడి వెయ్యి అడుగుల ఎత్తైన కొండపై ఉంది. ఏడాదిలో ఒక్క రోజు మాత్రమే తెరిచి ఉండడంతో ఈ భోలేనాథ్ టెంపుల్ కు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
భోపాల్‌కు 48 కి.మీ దూరంలో ఉన్న ఈ సోమేశ్వరాలయాన్ని 10వ శతాబ్దంలో నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఈ ఆలయం ముస్లింరాజుల మూసివేశారని చరిత్ర చెబుతోంది. ఈ గుడిని తెరవాలంటూ 1974లో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. దీంతో అప్పటి ముఖ్యమంత్రి ఆలయాన్ని తెరిపించారు. కానీ ఒక్క శివరాత్రి రోజు మాత్రమే పూజలు నిర్వహించేందుకు అనుమతిస్తామని చెప్పారు. అప్పట్నుంచి ఈ సోమేశ్వర ఆలయం కేవలం శివరాత్రి రోజు మాత్రమే తెరుచుకుంటోంది. ప్రస్తుతం ఈ ఆలయం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. శివరాత్రి కావడంతో ఈ రోజు ఆలయ ద్వారాలను తెరిచారు. కేవలం 12 గంటలు మాత్రమే శివుడికి పూజలు నిర్వహించి రాత్రికి యధావిధిగా మూసివేయనున్నారు.