- 2014లో పనులు ప్రారంభించిన సర్పంచ్ దంపతులు
- పలు కారణాలతో నిలిచిన నిర్మాణం
- నెల కింద మొదలుపెట్టి పూర్తి చేసిన వైనం
ఎల్లారెడ్డిపేట, వెలుగు: తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చిన దేవత సోనియమ్మ అంటూ ఆమె కోసం గుడి కట్టారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన సర్పంచ్ దంపతులు. తెలంగాణ రాష్ర్ట అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ గుడి ని ప్రారంభించారు. 2014లో అప్పటి సర్పంచ్మమత, ఈమె భర్త వెంకట్‌రెడ్డి సాయిబాబా కమాన్ పక్కన చిన్న గుడి నిర్మాణం మొదలుపెట్టారు. అది పలు కారణాలతో ఆగిపోగా మళ్లీ నెల కింద పనులు మొదలుపెట్టి పూర్తి చేశారు. నాలుగు ఫీట్ల ఎత్తుతో పాలరాయి వేసి లోపల సోనియాగాంధీ ఫొటో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వెంకట్‌రెడ్డి సర్పంచ్‌గా ఉండగా ఆదివారం రాష్ర్ట పీసీసీ మెంబర్ నాగుల సత్యనారాయణ గౌడ్, ప్రచార కమిటీ మెంబర్స్ సంగీతం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని, అందుకే ఆమెకు గుడి కట్టి కొలుస్తున్నామన్నారు. త్వరలోనే విగ్రహం ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య,లీడర్లు షేక్ గౌస్, వంగ గిరిధర్ రెడ్డి, మర్రి శ్రీనివాస్ రెడ్డి, చెన్ని బాబు, బండారి బాల్ రెడ్డి, గంట అంజాగౌడ్, పందిర్ల లింగం గౌడ్, బుగ్గ కృష్ణమూర్తి, గంట వెంకటేష్ గౌడ్, గన్న మల్లారెడ్డి,నంది కిషన్ పాల్గొన్నారు.