యాసిడ్ దాడి సూత్రధారి ఆలయ పూజారే.. అకౌంటెంట్‌‌పై మరో పూజారితో దాడి చేయించిండు

యాసిడ్ దాడి సూత్రధారి ఆలయ పూజారే.. అకౌంటెంట్‌‌పై మరో పూజారితో దాడి చేయించిండు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ సైదాబాద్​పరిధిలోని దోబీఘాట్​ రోడ్డులో ఉన్న భూలక్ష్మి ఆలయంలో ఈ నెల 14న అకౌంటెంట్‌‌పై జరిగిన యాసిడ్ ​దాడి కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. యాసిడ్​ దాడి చేసిన నిందితుడితో పాటు చేయించింది కూడా పూజారే కావడం గమనార్హం. ఈ కేసు వివరాలను సౌత్ ఈస్ట్ డీసీపీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ ఆదివారం వెల్లడించారు. 

ఈ నెల 14న భూలక్ష్మీ ఆలయంలో అకౌంటెంట్ నర్సింగ్‌‌రావుపై యాసిడ్ దాడి జరిగింది. నర్సింగ్‌‌ రావు గుడిలో కూర్చుని ఉండగా, గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ‘హ్యాపీ హోలీ’ అంటూ యాసిడ్ పోశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరు స్పెషల్​టీమ్స్​ ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకోవడానికి దాదాపు 400 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. దాడికి ముందు నిందితుడు గాంధీ భవన్ మెట్రో స్టేషన్ వద్ద టోపీ కొంటున్నట్టు గుర్తించారు. టోపీలు అమ్మే వ్యక్తిని విచారించి పేమెంట్ ​ఫోన్​ పే ద్వారా చేశాడని తెలుసుకున్నారు. 

ఆ ట్రాన్సాక్షన్, ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని షేక్‌‌పేటకు చెందిన పూజారి రాయికోడ్ హరిపుత్రగా గుర్తించారు. ఇతడిది మెదక్​ జిల్లా సదాశివపేట. ఇతడిని విచారించి ఫోన్​ చెక్​ చేయగా భూలక్ష్మి టెంపుల్​ పూజారి రాజశేఖర్ శర్మతో చేసిన వాట్సాప్ చాట్, కాల్స్ కనిపించాయి. రాజశేఖర్ శర్మే తనతో ఈ దాడి చేయించినట్టు నిందితుడు హరిపుత్ర చెప్పాడు. రూ.2 వేలకు బేరం కుదుర్చుకున్నాడని, రూ.వెయ్యి అడ్వాన్స్ గా ఫోన్ పే చేశాడని తెలిపాడు. దీంతో రాజశేఖర్​శర్మను కూడా పోలీసులు అరెస్ట్​ చేశారు. పాత కక్షలతోనే నర్సింగ్‌‌ రావుపై దాడి చేయించానని రాజశేఖర్ శర్మ ఒప్పుకున్నాడు.