గాంధీనగర్​ శివాలయంలో చోరీ చెప్పులతో ప్రవేశించి.. గుడి తలుపులు తన్నిన వైనం

గాంధీనగర్​ శివాలయంలో చోరీ చెప్పులతో ప్రవేశించి.. గుడి తలుపులు తన్నిన వైనం

జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్ల పరిధి గాంధీనగర్​లోని శ్రీ రామలింగేశ్వర, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. 

చెప్పులతో ఆలయంలోకి ప్రవేశించడమే కాకుండా గుడి తలుపులను కాలితో తన్నడంతో తాళం ఊడిపోయింది. అనంతరం స్వామి వారికి అలంకరించిన ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనపై హిందూ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్​పరిధిలోని దేవాలయాల్లో దొంగతనాలు ఎక్కువయ్యాయన్నారు. శివుడి గుడిలోకి చెప్పులతో 
ప్రవేశించి మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించిన  దొంగలను వెంటనే అరెస్ట్​చేయాలని డిమాండ్​ చేశారు. 

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

గండిపేట్: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు చొరబడి బంగారం ఎత్తుకెళ్లారు. బండ్లగూడ జాగీరు మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని బైరాగిగూడలో బుజ్జి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. ఆదివారం ఇంటికి తాళం వేసి గుడివాడలో తన బంధువుల ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంట్లో ప్రవేశించి,  బీరువాలో దాచి పెట్టిన 15 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.