టెంపుల్ టూరిజం @ భద్రాచలం.. కొవ్వూరు–భద్రాచలం కొత్త రైల్వే లైన్​కూ గ్రీన్​ సిగ్నల్​

టెంపుల్ టూరిజం @ భద్రాచలం.. కొవ్వూరు–భద్రాచలం కొత్త రైల్వే లైన్​కూ గ్రీన్​ సిగ్నల్​
  • ప్రసాద్ స్కీమ్ కింద కేంద్రం రూ. 45 కోట్లు కేటాయింపు
  • మల్కన్​గిరి- పాండురంగాపురం రైల్వేలైన్​ నిర్మాణం
  • భూ సేకరణకు నోటిఫికేషన్​ జారీ.. టెండర్ల ప్రక్రియ పూర్తి 
  • కొవ్వూరు–భద్రాచలం కొత్త రైల్వే లైన్​కూ గ్రీన్​ సిగ్నల్​
  • రెండు ప్రాజెక్టులు పూర్తయితే  భద్రాచలానికి మహర్దశ

భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో టెంపుల్​టూరిజం అభివృద్ధికి అడుగులు పడ్డాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్ కింద తొలివిడత రూ.41 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.22 కోట్లతో భద్రాచలం ఆలయం, పర్ణశాలలో  పనులు చేపట్టారు. భూసేకరణకు రాష్ట్ర సర్కారు కూడా రూ.60.20 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం పనులు తుది దశకు చేరాయి.  మరోవైపు కేంద్రం స్పెషల్ రైల్వే ప్రాజెక్టుగా ఒడిశాలోని మల్కన్​గిరి, తెలంగాణలోని -పాండురంగాపురం మధ్య 173.6  కి.మీ బ్రాడ్​గేజ్​ రైల్వే లైన్​నిర్మాణానికి భూసేకరణకు నోటిఫికేషన్​జారీ చేసింది. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసింది.

రైల్వే భూ సేకరణ చట్టం –2008 ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు భూములను సేకరించనుంది. తెలంగాణలో 19.7 కి.మీ, ఏపీలో 85.5 కి.మీ, ఒడిశాలో 68.3 కి.మీ మేర రైల్వే ట్రాక్​నిర్మిస్తారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం భద్రాచలం-కొవ్వూరు ప్రాజెక్టుకు కూడా గ్రీన్​సిగ్నల్​ఇచ్చింది. రూ.2,115 కోట్లతో చేపట్టబోయే ప్రాజెక్టును 2030 నాటికి పూర్తి చేస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​లోక్​సభలో ప్రకటించారు. దీంతో రెండు రైల్వే లైన్లు భద్రాచలం ఆలయానికి దేశ నలుమూలల నుంచి భక్తులు, పర్యాటకులు వచ్చేందుకు దోహదపడతాయి. దీనికి తోడు టెంపుల్ టూరిజం అభివృద్ధికి ఆ ప్రాజెక్టులు వచ్చే పదేండ్లలో  భద్రాచలం రూపురేఖలను 
మార్చివేస్తాయి.

భద్రాద్రిపై రియల్టర్ల ఫోకస్
రైల్వే ప్రాజెక్టులు, ఆలయ అభివృద్ధి పనులకు రూపకల్పన జరగడంతో రాష్ట్రంలోని రియల్టర్ల ఫోకస్ భద్రాచలంపై పడింది. ఇప్పటికే ఆంధ్రాలో విలీనమైన పంచాయతీలు ఏటపాక, పిచ్చుకులపాడు, గుండాల, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నంలో భూములు కొనేందుకు సిద్ధమయ్యారు. ఏటపాక మండలం చెన్నంపేట శివారు నుంచి రైల్వే లైను, బూర్గంపాడు మండలం మోతెగడ్డ ద్వీపం మీదుగా బ్రిడ్జి ద్వారా పాండురంగాపురానికి వెళ్తుంది. దీంతో బూర్గంపాడు మండలం సారపాక, మోతె ప్రాంతాల్లో కూడా భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. ఇక భద్రాచలంలో సైతం ఖాళీ భూముల కొనుగోళ్లలో వేగం పెరిగింది. నిన్న, మొన్నటి వరకు పోలవరం బ్యాక్ వాటర్, రాష్ట్ర విభజన కారణంగా డీలా పడ్డ రియల్ఎస్టేట్​మళ్లీ పుంజుకుంటోంది. 

టూరిస్టులు పెరిగే అవకాశాలు 
భద్రాచలం, కిన్నెరసాని, తుమ్మలచెరువు, పూబెల్లి, బెండాలపాడు, బొజ్జిగుప్ప, నారాయణరావుపేటను ఎకో టూరిజంగా డెవలప్ చేసేందుకు జిల్లా కలెక్టర్​చొరవ చూపుతుండగా..ఆయా ప్రాంతాలకు పర్యాటకులు ఎక్కువగా వస్తారు. దీంతో  జిల్లాలో పర్యాటకం జోరందుకోనుంది. భద్రాద్రి టెంపుల్​చుట్టూ ఉన్న టూరిజం స్పాట్లతో పాటు పాపికొండలు, గోదావరి విహారయాత్రకు డిమాండ్​అధికంగా ఉంటుంది.  రైలు సౌకర్యం ఉంటే టూరిస్టులు మరింత పెరుగుతారు. దీంతో అభివృద్ధికి బాటలు పడతాయి.

పర్యాటకంగా అభివృద్ధి
జిల్లాలో టూరిజం డెవలప్ మెంట్ కు చాలా అవకాశాలు ఉన్నాయి. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తే గిరిజన స్థితిగతులు మారిపోతాయి. వారు స్వయం ఉపాధి పొందుతారు. తద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మరోవైపు అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి చెందుతుంది. రాబోయే రోజుల్లో జిల్లాలోని గిరిజన ప్రాంతాలకు అధిక ప్రాధాన్యత పెరుగుతుంది.


జితేష్ వి పాటిల్, భద్రాద్రి జిల్లా కలెక్టర్