- ఆందోళన చేసి ఆలయ ప్రవేశం చేయించిన దళిత సంఘాలు
- నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలంలో ఘటన
ఉప్పునుంతల(వంగూర్), వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలంలోని చాకలి గుడిసెల గ్రామంలో సోమవారం ఓ దళిత మహిళ ఆలయంలోకి వెళ్లిందనే కారణంతో అక్కడి వారు తాళం వేశారు. బాధితురాలి కథనం ప్రకారం..చాకలి గుడిసెల గ్రామానికి చెందిన వింజమురి బాలమణి సోమవారం స్థానికంగా ఉన్న రామాలయంలోకి వెళ్లింది. ఇది గమనించిన గ్రామంలో కొంతమంది ‘నువ్వు దళితురాలివి. గుడిలోకి రాకూడదు. నువ్వు వెళ్లిన గుడిలోకి మేము వెళ్లం’ అని తాళాలు వేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు, జిల్లా లీడర్లు మాచారం వెంకటేశ్ ఊరికి వచ్చి దళిత మహిళతో కలిసి ధర్నా చేశారు.
ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్భర్త రాజు వచ్చి క్షమాపణ చెప్పి గుడి తాళం అప్పగించాడు. దీంతో వారు దళిత మహిళతో కలిసి ఆలయ ప్రవేశం చేశారు. ఎమ్మార్పీఎస్ కన్వీనర్ సౌట కాశీం, ఎమ్మెస్ఎఫ్ జిల్లా కన్వీనర్ మహేశ్, ఎమ్మార్పీఎస్ వంగూర్ మండల అధ్యక్షుడు చింతకుంట్ల నిరంజన్, కేవీపీఎస్జిల్లా అధ్యక్షుడు పరుశరాములు, మండల కార్యదర్శి బాలస్వామి, ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ సభ్యులు ఉప్పరి బాలరాజు, జిల్లా నాయకులు బాలరాజు పాల్గొన్నారు.