దేవుడి సొమ్ము ఎత్కవోతున్న దొంగలు

దేవుడి సొమ్ము ఎత్కవోతున్న దొంగలు

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల పోలీసు స్టేషన్ పరిధిలో వరుస చోరీలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఆలయాలే టార్గెట్గా ఏడాదిన్నర కాలంలో  మూడు సార్లు ఆలయాల్లో చోరీలు జరిగాయి. తాజాగా నిన్న రాత్రి మండల పరిధిలోని రెండు ఆలయాల్లో చోరీ జరిగింది. ఏకశిలా పాంబండ రామలింగేశ్వర ఆలయ ఆవరణలో ఉన్న అమ్మవారి గుడి గ్రిల్ను  కొందరు గుర్తుతెలియని దుండగులు విరగ్గొట్టారు. గుడిలోని అమ్మవారి వెండి కిరీటాన్ని ఎత్తుకెళ్లారు.

ఉదయం ఆలయం శుభ్రం చేసేందుకు వెళ్లిన ఆలయ సిబ్బంది చోరీ జరిగిన విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి రెండున్నర గంటల సమయంలో ఒక స్విఫ్ట్ కారులో కొందరు దుప్పట్లు కప్పుకొని వచ్చి గుడి ఆవరణలో సంచరించినట్టు సీసీ కెమరాల్లో రికార్డయ్యింది.గతంలో కూడా  మూడుసార్లు ఆలయంలో చోరీకి విఫలయత్నం చేశారు.ఈ ఘటన ఇలా ఉండగా కుల్కచర్ల మండలం దాస్యనాయక్ తాండాలోని సేవాలాల్ గుడిలో కూడా చోరీ జరిగింది. ఉదయం ఏడు గంటల సమయంలో గుడిని శుభ్రం చేయడానికి వెళ్లిన గుడినిర్వాహకుడు చోరీ జరిగిన విషయాన్ని గమనించి తాండావాసులకు సమాచారం అందించాడు.

అమ్మవారి గుడితో పాటు సేవాలాల్ గుడి తాళాలు విరగ్గొట్టి హుండీ లు,విగ్నేష్వర స్వామి విగ్రహాన్ని ఎత్తుకెళ్ళినట్టు తాండావాసులు గుర్తించారు. రాత్రి ఒంటిగంట సమయంలో ఓ కారులో కొందరు వ్యక్తులు వచ్చి గుడి ఆవరణలో పడుకున్నారని స్థానికులు చెబుతున్నారు.ఒకే రోజు రెండు గుడుల్లో చోరీ జరగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా ఆలయాలే టార్గెట్ గా వరుసగా మండల కేంద్రంలో జరుగుతున్న చోరీలతో స్థానికులు బెంబేలెత్తి పోతున్నారు. వరుస చోరీలకు పాల్పడుతున్న దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.